జల్లికట్టుకు పట్టు

19 Dec, 2015 08:29 IST|Sakshi
జల్లికట్టుకు పట్టు

గళం విప్పుతున్న పార్టీలు
స్టాలిన్ నేతృత్వంలో 28న దీక్ష
వేదికగా అలంగానల్లూరు

 
చెన్నై : జల్లికట్టు నిర్వహణకు డిమాండ్ పెరుగుతోంది. అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ రాజకీయ పక్షాలు స్వరం పెంచుతున్నాయి. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ పిలుపుతో మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయన నేతృత్వంలో ఈనెల 28న అలంగానల్లూరు వేదికగా భారీ నిరసన దీక్షకు నిర్ణయించారు.

తమిళుల సాహసక్రీడగా, వీరత్వానికి ప్రతీగా నిలిచిన జల్లికట్టుకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసిన విషయం  తెలిసిందే. ఈ సారి ఎలాగైనా సరే సంక్రాంతి పర్వదినం రోజున జల్లికట్టు నిర్వహించి తీరాలన్న సంకల్పంతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా జల్లికట్టుకు ప్రసిద్ధి చెందిన మదురైతో పాటుగా దక్షిణ తమిళనాడులోని పది జిల్లాల్లో నిర్వాహకులు తమకు అనుమతి లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నా, అందుకు తగ్గ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
 
ఈ సమయంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ జల్లికట్టు కోసం మహాపోరుకు పిలుపు నివ్వడంతో మద్దతు వెల్లువెత్తుతోంది. స్టాలిన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని పది జిల్లాలకు చెందిన జల్లికట్టు నిర్వాహకులు చెన్నైకు తరలివచ్చారు. శుక్రవారం ఉదయాన్నే గోపాలపురానికి చేరుకున్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్‌లను కలుసుకుని మద్దతు తెలియజేశారు.

ఎలాంటి నిరసననలు, పోరుకైనా తాము సిద్ధం అని, తాము వెన్నంటి ఉంటామని, తమరు ముందుకు సాగాలని కరుణానిధికి విజ్ఞప్తి చేశారు. సుమారు గంట పాటుగా సాగిన భేటీ అనంతరం మహా పోరుకు సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. అన్ని జిల్లాల్లో ఇక నిరసనలు హోరెత్తనున్నాయి. జల్లికట్టుకు అనుమతి నినాదంతో ఆయా జిల్లాల్లో నిర్వాహకులు ఓ వైపు పోరు బాటకు సిద్ధమైతే, మరో వైపు మదురై కేంద్రంగా  28న భారీ నిరసన దీక్షకు నిర్ణయించారు.
 
నిరసన దీక్ష : ఈ భేటీ అనంతరం మీడియాతో ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, జల్లికట్టు విశిష్టతను వివరిస్తూ, తమ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని అన్నాడీఎంకే సర్కారు నీరుగార్చిందని, అందుకే కోర్టు సైతం అడ్డుకట్ట వేసిందన్నారు. తమిళుల వీరత్వాన్ని తుంగలో తొక్కడం లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని డిమాండ్ చేశారు. జల్లికట్టుకు మద్దతు వెల్లువెత్తుతున్నదని, ఇక్కడి తరలివచ్చిన నిర్వాహకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని సూచించారని వివరించారు.
 
అధినేత కరుణానిధి ఆదేశాల మేరకు మదురై జిల్లా అలంగానల్లూరు వేదికగా భారీ నిరసన దీక్షను ఈనెల 28న చేపట్టనున్నామన్నారు. దీనికి తాను నేతృత్వం వహించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని తమిళులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని, జల్లికట్టుకు అడ్డంకుల్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

పీఎంకే అధినేత రాందాసుతో పాటుగా పలువురు జల్లికట్టుకు అనుకూలంగా గళం విప్పే పనిలో పడ్డారు. దీంతో జల్లికట్టుకు మద్దతు స్వరం పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చట్టం తీసుకొచ్చి జల్లికట్టుకు ఎదురైన అడ్డంకులు తొలగించేందుకు ప్రయత్నాలు చేపట్టాలన్న ఒత్తిడికి సర్వత్రా సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు