ఏమో.. ప్రధానినీ కావచ్చేమో : నటుడు

8 Apr, 2018 09:57 IST|Sakshi

రాజరాజేశ్వరి నగర నుంచి పోటీ చేస్తా ∙సినీ నటుడు హుచ్చ వెంకట్‌ 

శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సినీ నటుడు హుచ్చ వెంకట్‌ తెలిపారు. చిన్న  చిన్న సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వినూత్న నటన ప్రదర్శిస్తూ ఆయన సినీ అభిమానులకు సుపరిచితమే. శనివారం ప్రెస్‌క్లబ్‌లో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్నం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అందుచేత ఈసారి కాంగ్రెస్‌పార్టీ ఆయనకు టికెట్‌ ఇవ్వదన్నారు. 

అలాగే జేడీఎస్‌ సైతం మునిరత్నంకు టికెట్‌ ఇవ్వటానికి నిరాకరిస్తోందని, ఒకవేళ టికెట్‌ ఇస్తే ముందు ఏర్పడే బీజేపీ–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి కళంకం ఏర్పడుతుందని ఇవ్వదని జోస్యం చెప్పారు. ఇప్పటికే కుక్కర్ల రాజకీయం ఆరంభమైందని, అంతేకాకుండా చీరలు, మద్యం అమ్మకాలు అధికమయ్యాయని తెలిపారు. ఇకపై స్థలాలు అమ్ముతారు, విధానసౌధను సైతం అమ్మటానికి వెనుకాడని నాయకులకు ఎన్నికల్లో అవకాశం కల్పించరాదని పిలుపునిచ్చారు. మునిరత్నం ఎమ్మెల్యేగా కాకముందు ఉన్న బ్యాంకు బ్యాలెన్స్, ప్రస్తుతమున్న బ్యాంకు బ్యాలెన్స్‌పై లోకాయుక్త తనిఖీ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నానన్నారు. 

వినూత్న రీతిలో ప్రచారం చేపడతా 
త్వరలోనే ఎమ్మెల్యే నామినేషన్‌ వేసిన తరువాత వినూత్నంగా ప్రచారం చేపడతానన్నారు. నరేంద్ర మోదీ, బరాక్‌ ఒబామా సైతం చేపట్టని ప్రచారాన్ని చేపట్టాలని ప్లాన్‌ చేసుకున్నానని మీడియాకు చెప్పారు. తనది కుక్కర్ల పార్టీ కాదని, ఎన్నికల్లో గెలిపిస్తే తనకు వచ్చే జీతం తీసుకొంటూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తానన్నారు.  

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు