కామ్రేడ్ పాన్‌సరేకు లాల్‌సలాం!

22 Feb, 2015 03:39 IST|Sakshi
కామ్రేడ్ పాన్‌సరేకు లాల్‌సలాం!

వేలాది మంది అశ్రునయనాల మధ్య కమ్యూనిస్టు నేతకు అంతిమ వీడ్కోలు
సాక్షి, ముంబై/కొల్హాపూర్: ప్రముఖ హేతువాది, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, టోల్ పన్ను వ్యతిరేక ఉద్యమకారుడు గోవింద్ పాన్‌సరేకు వేలాది మంది తమ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 16న కొల్హాపూర్‌లో దుండగుల కాల్పులకు గురైన పాన్‌సరే శుక్రవారం అర్థరాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. మెరుగైన చికిత్స కోసం 82 ఏళ్ల పాన్‌సరేను కొల్హాపూర్ నుంచి శుక్రవారం ఉదయం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారు.

కానీ ఆయన ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం అధికం కావడంతో మరణించారని జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్ టీపీ లహానే ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం మధ్యాహ్నం తిరిగి కొల్హాపూర్ తీసుకొచ్చారు. పాన్‌సరే హత్యను అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. నిస్వార్థపరుడైన పాన్‌సరేను హత్య చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. ఈ నేరానికి పాల్పడిన దుండగులను శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు ఆయన మంత్రివర్గ సహచరులు, బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, ఆర్‌పీఐ పార్టీల నేతలు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు.  

పాన్‌సరే హత్యకు నిరసనగా, ఆయన హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సీపీఐ సమా అన్ని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్‌పీఐ, ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని బీఆర్‌పీబీఎం పార్టీలు మద్దతు పలికాయి. ఓ ప్రగతిశీల నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని, పేదలకు న్యాయం చేకూర్చేందుకు ఆయన చేసిన పోరాటాన్ని రాష్ట్రం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు. పాన్‌సరే హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు.
 
ఎర్ర సముద్రాన్ని తలపించిన కొల్హాపూర్
కామ్రేడ్ పాన్‌సరేకు లాల్ సలాం అన్న నినాదాలతో కొల్హాపూర్ శనివారం హోరెత్తిపోయింది. పాన్‌సరే అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది ప్రజలతో కొల్హాపూర్ పట్టణం ఎర్రసముద్రాన్ని తలపించింది.పంచగంగ నదీ తీరంలో పాన్‌సరే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కమ్యునిస్ట్ నాయకులు, కార్యకర్తలతో ఆ పరిసరాలు ఎరుపెక్కాయి. ‘రెడ్ సెల్యూట్ టూ పాన్‌సరే’, ‘లాల్ సలాం - పాన్‌సరే అమర్హ్రే’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దసరా చౌక్‌లో అంతిమ దర్శనం కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. వేలాది మంది ఆయనను చివరిసారిగా చూసి నివాళులు అర్పించారు. సాయంత్రం మూడు గంటల తర్వాత పంచగంగ నదీతీరం వైపు అంతిమయాత్రను ప్రారంభించారు. నదీ తీరంలో పాన్‌సరే భౌతికకాయనికి ఆయన కోడలు మనమళ్ల చేతులమీదుగా దహన సంస్కారం పూర్తిచేశారు.
 
విమానాశ్రయంలోనే ఒక గంటపాటు భౌతికకాయం
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోవింద్ పాన్‌సరే భౌతికకాయం ఒక గంటపాటు విమానాశ్రయంలో ఉండిపోయింది. పాన్‌సరే మరణానంతరం శనివారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకగంట ఆలస్యంగా కొల్హాపూర్‌కు బయలుదేరాల్సి వచ్చిందని శాసన మండలి సభ్యుడు కపిల్ పాటిల్ ఆరోపించారు. ఒక్క అధికారి కూడా ఎయిర్‌పోర్ట్ వద్దకి రాలేదన్నారు. ఉదయం 10.20 గంటలకు తాము పాన్‌సరే భౌతిక కాయాన్ని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చామని, కానీ 11..54 గంటలకు కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానం బయల్దేరిందని చెప్పారు. దీంతో తాము 12.55 గంటలకు కొల్హాపూర్ చేరుకున్నామన్నారు.
 
కాల్పులు జరిపింది మరాఠీ భాషీయులే

సాక్షి, ముంబై:  గోవింద్ పాన్‌సరే దంపతులపై కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని భావిస్తున్నారు. గోవింద్ పాన్‌సరే సతీమణీ ఉమా పాన్‌సరే పోలీసులకు అందించిన వివరాల మేరకు కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని వెల్లడైంది. కోల్హపూర్‌లో చికిత్స పొందుతున్న ఆమె దర్యాప్తు అధికారితో మాట్లాడారు. ఈ నెల 16న తామిద్దరం వాహ్యాళికి వెళ్లిన ప్పుడు తమకు ఎదురైన దుండగులు ‘మోరే యెతే కుటే రహతాత్..? (మోరే ఎక్కడ ఉంటారు..?)’ అని ప్రశ్నించారు. అనంతరం సుమారు 15 నుంచి 17 నిమిషాలకు తాము ఇంటివైపు వెళ్లే సమయంలో మళ్లీ వారిద్దరు మోటర్‌సైకిల్ వచ్చి కాల్పులు జరిపారు’ అని ఆమె పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దుండగులు ముందుగా తన భర్త గోవింద్ పై కాల్పులు జరిపారని, ఆయనకు అడ్డుగా వెళ్లిన తనపై కూడా కాల్పులు జరిపారని  చెప్పారు.

మరిన్ని వార్తలు