త్వరలో అటవీశాఖలో పోస్టుల భర్తీ

12 Dec, 2016 15:24 IST|Sakshi
త్వరలో అటవీశాఖలో పోస్టుల భర్తీ
హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి
జిల్లాలో 1.80 కోట్ల మొక్కలు పెంచేందుకు చర్యలు
రివ్యూ సమావేశంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న
 
ఖమ్మం: త్వరలో అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర అటవీ, వెనుకబడిన తిరుగతుల శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా అటవీశాఖ కార్యాలయంలో అటవీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడంలో అధికారుల తమ వంతు బాధ్యతగా  చర్యలు చేపట్టాలన్నారు. వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతంలో మొక్కల సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. కొత్తగా జిల్లాల పునర్విభజన  నేపథ్యంలో అటవీశాఖలో రేంజ్‌ ఆఫీసర్‌ స్థాయి, ఇతర అధికారుల సంఖ్యను పెంచడం జరిగిందని, కార్యాలయాల వసతి, పోస్టుల ఖాళీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అటవీశాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా  మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో 3 కోట్ల 88 లక్షల మొక్కలను నాటామని, వీటిలో 90 శాతం వరకు మొక్కలను సంరక్షించుకున్నామని అన్నారు. వర్షాభావ పరిస్థితులున్న తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో 80 శాతం వరకు మొక్కలు సంరక్షించడం జరిగిందన్నారు. నర్సరీలలో మొక్కలు పెంచే ప్రణాళికలను కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో కోటీ 80 లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇందుకుగాను 2 కోట్ల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 
 
 
మరిన్ని వార్తలు