ఎంత కష్టం.. ఎంత కష్టం..

12 Dec, 2016 15:10 IST|Sakshi
ఎంత కష్టం.. ఎంత కష్టం..
 మహారాష్ట్రలోని భివండిలో దెబ్బతిన్న పవర్‌లూమ్ పరిశ్రమ 
 ఉపాధి లేక రాష్ట్ర కార్మికులు విలవిల 
 ఇప్పటికే చేసిన పనికీ జీతాలందని దుస్థితి
 చేతిలో చిల్లిగవ్వ లేక అవస్థలు 
 పస్తులుండాల్సి వస్తోందంటూ కార్మికుల ఆవేదన  
 
భివండి: పొట్టచేతబట్టుకుని రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని భివండికి తరలివెళ్లిన వలస కార్మికులకు నోట్ల రద్దు కష్టాలు చుట్టుముట్టారుు. అక్కడి పవర్‌లూమ్ (చేనేత) పరిశ్రమల్లో పనులు నిలిచిపోవడంతో.. వాటిలో పనిచేస్తున్న వేలాది మంది రాష్ట్ర కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పటికే చేసిన పనికి సంబంధించిన జీతాలూ అందని పరిస్థితి నెలకొంది. అంతేకాదు అనేక ఒడిదుడుకుల మధ్య నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడిపోయే దుస్థితి ఏర్పడింది. దీంతో కార్మికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
భారీగా తగ్గిన ఉత్పత్తి
భివండిలోని పవర్‌లూమ్ పరిశ్రమలపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. ఇక్కడ ఇప్పటి వరకు రెండు షిప్టులుగా నడుస్తున్న పరిశ్రమల్లో ఇప్పుడు ఒకే షిఫ్టు నడుస్తోంది, మరికొన్ని పరిశ్రమల్లో రోజూ ఒక్క షిఫ్టు కూడా కొనసాగడం లేదు. ముఖ్యంగా నోట్ల రద్దు అనంతరం వస్త్రాల తయారీ కోసం కావల్సిన నూలు, ఇతర సామగ్రి లభించడం లేదు. రూ.500, రూ.1,000 నోట్లు చెల్లని కారణంగా కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక పవర్‌లూమ్‌లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడి.. కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వలస వెళ్లిన కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ పవర్‌లూమ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వారందరూ ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయారు. 
 
పనులు లభించడం లేదు
‘‘ఇప్పటికే సరిగా పనుల్లేవు. నోట్ల రద్దుతో మరింత ఇబ్బం దిగా మారింది. ఈ నెలలో సగం జీత మే వచ్చే పరిస్థితి ఉంది. ఖర్చులు మాత్రం పెరిగారుు..’’
 - పిశికె రామచంద్రం, కార్మికుడు (యాదాద్రి జిల్లా రాజపేట)
 
ఒకే షిఫ్టు నడపాల్సి వస్తోంది
ఇప్పటి వరకు రెండు షిప్టులు నడిపేవాళ్లం. ఇప్పు డు ఒకే షిప్టు నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్పత్తి చేసిన వస్త్రాలు అమ్ముడు పోవడంలేదు. దీంతో పవర్‌లూమ్‌లను ఆపేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు..’’
- శ్రీపతి నారాయణ, పవర్‌లూం నిర్వాహకుడు (కరీంనగర్ జిల్లా బూర్గుపెల్లి)
 
ఇలాగైతే మూసివేయాల్సిందే
‘‘నోట్ల రద్దు ప్రభావం కారణంగా తమిళనాడు, గుం టూరు తదితర ప్రాంతాల నుం చి వచ్చే నూలు లారీలను 3 రోజులుగా నిలిపివే శారు. ఇలాగైతే పరిశ్రమలు మూత పడే అవకాశం కనబడు తోంది..’’
 - సిరిపురం తిరుపతి, భివండి పవర్‌లూం మజూర్‌బీమ్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (గ్రామం లక్ష్మిదేవిపల్లె, జిల్లా కరీంనగర్ ) 
 
ఫలితం దక్కడం లేదు
‘‘గతంలో 50 పవర్‌లూమ్ పరిశ్రమలకు బీములు నింపి పంపేవాళ్లం. ఇప్పుడు పరిశ్రమలు మూతపడుతుండడంతో ఎనిమిదింటికే నింపిస్తున్నాం. కనీసం నా జీతం మేర కూడా రావటం లేదు..’’
- శ్రీగాది రాజేశం, బీములు నింపే కాంట్రాక్టర్ (రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట)
 
పస్తులుండాల్సిన పరిస్థితి..
‘‘నోట్ల రద్దు ప్రభావంతో రోజు గడవడం కష్టమవుతోంది. పరిశ్రమలు బంద్ కావటంతో పనులు లభించడం లేదు. పని ఉంటేనే జీతం వస్తుంది. చేతిలో డబ్బుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది...’’
 - చెరుకు అంబదాస్, కార్మికుడు (వరంగల్ జిల్లా ధర్మసాగర్)
 
పని దొరికినా పాతనోట్లే..
‘‘నోట్ల రద్దుతో పనులు లేకుండా పోయారుు. పనిదొరికినా పాత రూ.500, 1,000 నోట్లు ఇస్తున్నారు. వాటిని మార్చుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. నాకు బ్యాంకు ఖాతా లేదు. పోస్టాఫీసు వద్ద నాలుగు రోజుల నుంచి నిలబడ్డా నోట్ల మార్పిడి పూర్తికాలేదు..’’ - బొద్దుల సదానంద్, 
-బీములు నింపే కార్మికుడు (జిల్లా వరంగల్)
>
మరిన్ని వార్తలు