పాప్ కింగ్‌కు పట్టం

8 Apr, 2016 10:18 IST|Sakshi
పాప్ కింగ్‌కు పట్టం
  • వేల్స్‌లో మైఖెల్ జాక్సన్ విగ్రహం ప్రతిష్ట
  • ఆవిష్కరించిన నటుడు ప్రభుదేవా
  • విద్యార్థులతో సందడి
  • మహదానందంగా ఉందని వ్యాఖ్య
  •  
    చెన్నై: పాప్ సంగీత ప్రపంచంలో రాజుగా వెలిగిన మైఖెల్ జాక్సన్‌కు వేల్స్ వర్సిటీ పట్టం కట్టింది. సంగీత ప్రియుల్ని ఓలలాడించిన పాప్‌కింగ్ నిలువెత్తు విగ్రహాన్ని తమ వర్సిటీలో ప్రతిష్టించింది. గురువారం జరిగిన వేడుకలో ఈ విగ్రహాన్ని ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా ఆవిష్కరించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.


    ‘మైఖెల్ జాక్సన్’ అన్న ఆ పేరులోనే ఉంది ఓ వైబ్రేషన్. పాప్ సంగీత సామ్రాజ్యంలో గాయకుడిగా, నృత్యకారుడిగా ప్రపంచ స్థాయిలో పాప్ కింగ్‌గా అవతరించి అమరుడైన మైఖెల్ జాక్సన్‌ను స్మరిస్తూ వేల్స్ వర్సిటీ విగ్రహ ప్రతిష్టకు చర్యలు చేపట్టింది.
     
    ఇందుకు  చెన్నైకు చెందిన ఆర్‌సీ గోల్డన్ గ్రానైట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చంద్రశేఖరన్ ముందుకు వచ్చారు. 3.5 టన్నుల గ్రానైట్ రాతితో ఏక శిలా విగ్రహం తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. శిల్పకళాకారుడు రమేష్ 40 రోజులు శ్రమించి మైఖెల్ జాక్సన్ నిలువెత్తు ఏకశిలా గ్రానైట్ విగ్రహానికి బెంగళూరులో రూపకల్పన చేశారు. రూ.12 లక్షల ఖర్చుతో పది అడగులు ఎత్తు, 5.5 అడుగుల వెడల్పుతో పాప్‌కింగ్ స్టెప్పులు వేస్తున్నట్టుగా విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి సైతం ఎక్కడం విశేషం. అలాంటి ఈ విగ్రహాన్ని పల్లావరం సమీపంలోని వేల్స్ వర్సిటీలో ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన వేడుకలో ఇండియన్ మైఖెల్ జాక్సన్, ప్రముఖ నటుడు, దర్శకుడు,నిర్మాత ప్రభుదేవా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    మహదానందం:

    ఈ విగ్రహావిష్కరణ అనంతరం మీడియాతో ప్రభుదేవా మాట్లాడుతూ చెన్నై వేల్స్ వర్సిటీలో విగ్రహం ఏర్పాటు చేశారన్న సమాచారంతో షాక్‌కు గురయ్యానని వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం తనకు ఈ సమాచారం తెలియగానే, ఎప్పుడెప్పుడు మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని చూస్తానో అన్న ఉత్సాహంతో ఎదురు చూశానని పేర్కొన్నారు. అందుకే ఆ విగ్రహం తరహాలో నిలబడి తానూ ఫొటోకు ఫోజు ఇచ్చానని, ఆ ఫొటోను తన ఇంట్లో భద్ర పరచుకుంటానన్నారు. ఆ విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం మహదానందంగా ఉందన్నారు.
     
    ఇక, సినిమా విషయాలకు వస్తూ, తన సొంత బ్యానర్‌లో మూడు చిత్రాలు చేస్తున్నట్టు వివరించారు. వేల్స్ వర్సిటీ చాన్సలర్ డాక్టర్ ఐషరి కె గణేష్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఇక్కడకు విగ్రహాన్ని తీసుకొచ్చామని, దీనిని ఇండియన్ మైఖెల్ జాక్సన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలన్న సంకల్పంతో ముందుకు సాగామన్నారు. ప్రభు దేవా చెన్నైకు వచ్చిన సమాచారంతో ఆయన్న సంప్రదించగా తక్షణం అంగీకరించడం అభినందనీయంగా పేర్కొన్నారు. తమ వర్సిటీలో వేల్స్ నక్షత్ర పేరిట వేడుకలు జరిగాయని గుర్తు చేస్తూ, ఆ సమయంలో ఇక్కడ డ్యాన్స్, మ్యూజిక్ డిప్లొమో, డిగ్రీ కోర్సుల ఏర్పాటుకు నిర్ణయించామని పేర్కొన్నారు.

    ఇందుకు తగ్గట్టుగా ప్రముఖ లక్ష్మణ్ శ్రుతి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని ప్రకటించారు. శిల్పకళాకారుడు రమేష్ మాట్లాడుతూ మైఖెల్ జాక్సన్ విగ్రహాన్ని సిద్ధం చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం వీ చెన్నై వారియర్స్ పేరిట జరిగిన కార్యక్రమానికి హాజరైన వలంటీర్లకు ఈసందర్భంగా ప్రభుదేవా చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. తదుపరి ఆ వర్సిటీలోని విద్యార్థులతో ముచ్చటించే విధంగా కాసేపు అక్కడే ఆనందంగా ప్రభు దేవా గడిపారు. ప్రభుదేవా రాకతో ఆయన్ను చూడడానికి  ఆ వర్సిటీలోని విద్యార్థులందరూ తరలి రావడం, సెల్ఫీల కోసం ఎగబడడంతో , వారిని కట్టడి చేయడం కష్టతరంగా మారిందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు