ప్రదీప్‌ చంద్రకే పగ్గాలిచ్చిన కేసీఆర్

30 Nov, 2016 14:04 IST|Sakshi
తెలంగాణ కొత్త సీఎస్‌ ప్రదీప్ చంద్ర

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్‌ చంద్ర నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదించడంతో సాయంత్రం ప్రదీప్‌ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ రోజు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి రెండో సీఎస్‌గా ప్రదీప్‌ చంద్ర బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తొలుత ఈ బాధ్యతలను సీఎం ఎవరికి అప్పగిస్తారనేది కాస్తంత ఉత్కంఠగా మారినా ప్రదీప్ చంద్రనే ఖరారు చేశారు.

సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రనే రేసులో ముందున్నారు. మంగళవారం రాత్రి వరకు కూడా సీఎస్ నియామకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలోనే ఉంది. దీంతో కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు తాజాగా వెలువడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది అధికారులు స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వారిలో కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమించేందుకు సీఎం మొగ్గు చూపారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులలో రాజీవ్‌శర్మ తర్వాత సీనియర్ ప్రదీప్ చంద్ర. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు.

ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో పరిశ్రమలు, వాణిజ్య, ఆర్థిక శాఖలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలక విభాగాల్లో.. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావడంతోపాటు వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రదీప్ చంద్రనే సీఎస్‌గా నియమించారు. మరోపక్క, మాజీ ఎంపీ వివేక్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా వివేక్‌ కొనసాగుతారు.

మరిన్ని వార్తలు