నిర్భయ స్మృతిలో...

29 Dec, 2013 23:13 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ కూడా యావత్ దేశంలో స్ఫూర్తి నింపిన ‘చె ల్లెమ్మ’ మనల్ని వీడి ఆదివారానికి సరిగ్గా ఏడాది పూర్తయింది. 12 నెలలు గడిచినా ఆనాటి కన్నీటి తడులు ఢిల్లీవాసి గుండె లను నేటికి బరువెక్కిస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 16న కదులుతున్న బస్సుల్లో పారామెడికల్ విద్యార్థినిపై నలుగురు మృగాళ్లు పైశాచికంగా దాడి చేసిన భయానక ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. యావత్‌దేశాన్ని ఒక్కటి చేసి పిడికిళ్లు బిగించి ఉద్యమించేలా ప్రేరణ ఇచ్చిన నిర్భయ మృతికి సంతాపంగా జంతర్‌మంతర్‌లో ఆదివారం పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. నిర్భయ నిందితులకు ఉరి వేయాలంటూ నినదించారు. డిసెంబర్ 16 క్రాంతి ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిర్భయ ఘటన జరిగి ఏడాది గడిచినా ఢిల్లీలో, దేశంలో మహిళల రక్షణకు సంబంధించి పరిస్థితిలో చె ప్పుకోదగ్గ మార్పు రాలేదని పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 నిందితుల దిష్టిబొమ్మలకు ఉరివేసి తమ నిరసన తెలిపారు. డిసెంబర్ 16 ఘటన తర్వాత ఢిల్లీలో మహిళల్లో చైతన్యం పెరిగిందని, తమపై జరుగుతున్న అమానుషాలను వారు మౌనంగా భరించకుండా పోలీసులను ఆశ్రయిస్తున్నారని క్రాంతి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం పలు సంఘాల విద్యార్థులు, ఢిల్లీవాసులు నిర్భయకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు. కొందరు విద్యార్థినులు నోటికి నల్లటి వస్త్రాలను కట్టుకొని నిరసన తెలిపారు. జ్యువెనైల్ అని ‘కీచకుడికి’శిక్ష తగ్గించే కుట్ర జరుగుతోందని, తప్పు చేసివారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. నిందితులను వీలైనంత త్వరగా ఉరితీసి మరోమారు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా గుణపాఠం చెప్పాలని కొందరు యువతులు కోరారు.
 
మరిన్ని వార్తలు