వదినమ్మకు పగ్గాలు

19 Apr, 2017 08:18 IST|Sakshi
ప్రేమలతకు పగ్గాలు

డీఎండీకే పగ్గాలు విజయకాంత్‌ సతీమణి ప్రేమలత చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేందుకు డీఎండీకే వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

సాక్షి, చెన్నై: 2005లో సినీ నటుడు విజయకాంత్‌ దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో తానొక్కడినే గెలిచినా, ఢీలా పడకుండా అడుగులు వేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో ముందుకు సాగి 2011లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అయితే 2016 ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు డీఎండీకేను ఢీలా పడేలా చేశాయి. ఎండీఎంకే, వామపక్షాలు, వీసీకే నేతృత్వంలోని కూటమిలోకి విజయకాంత్‌ వెళ్లడాన్ని ఖండిస్తూ, ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ బయటకు వచ్చేశారు. ఈ ప్రభావం ఆ ఎన్నికల్లో విజయకాంత్‌కు గట్టి దెబ్బ తగిలేలా చేశాయి.

 డిపాజిట్లే కాదు, గత కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంక్‌ను ఆయన కోల్పోక తప్పలేదు. మళ్లీ పూర్వ వైభవం లక్ష్యంగా మీలో ఒక్కడ్నీ అంటూ కేడర్‌ వద్దకు పరుగులు తీస్తూ వచ్చిన విజయకాంత్‌  ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రికి, ఇంటికి తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో పార్టీని నడిపించడంతోపాటుగా కేడర్‌ను దక్కించుకునే విధంగా పగ్గాలు ఆయన సతీమణి ప్రేమలతకు అప్పగించేందుకు తగ్గ కార్యాచరణ డీఎండీకేలో సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.

విజయకాంత్‌ సతీమణి ప్రేమలత మంచి వాక్చాతుర్యం కల్గిన వారు. సమయానుగుణంగా స్పందించే తత్వం  ఉన్న వారు. ఇంకా చెప్పాలంటే, విజయకాంత్‌ను మించి ప్రసంగాలు సాగించగల సమర్థురాలు.   డీఎండీకే ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర కీలకం. పార్టీలో ఎలాంటి పదవీ లేకున్నా, అన్నీ తానై విజయకాంత్‌ వెన్నంటి ఆమె  సాగుతున్నారని చెప్పవచ్చు. పార్టీలో ఆమెకు పదవి కట్టబెట్టాలన్న నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, విజయకాంత్‌ అందుకు తగ్గ నిర్ణయాన్ని ఎన్నడూ  తీసుకోలేదు. ఇందుకు కారణం, ఎక్కడ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తారోననే. ప్రస్తుతం సీనియర్లు ఎవ్వరూ ఆ పార్టీలో లేరు.

ఉన్నదంతా అభిమాన లోకం. వారిని రక్షించుకోవాలంటే, పార్టీ పగ్గాలు ప్రేమలతకు అప్పగించాల్సిన అనివార్యం ప్రస్తుతం ఏర్పడి ఉంది. విజయకాంత్‌ ఆసుపత్రిలో ఉండడంతో, పార్టీని నడిపించేందుకు తగ్గ కార్యాచరణను డీఎండీకే వర్గాలు సిద్ధం చేశాయి. విజయకాంత్‌ చేతిలో ఉన్న జోడు పదవుల్లో ఓ పదవిని ప్రేమలత స్వీకరించాలన్న నినాదాన్ని అందుకుని ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి విజయకాంత్‌ వద్దే ఉంచి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ప్రేమలత మీద ఒత్తిడి తెచ్చే పనిలో కేడర్‌ ఉన్నారు.

 సామాజిక మాధ్యమాల్లో, డీఎండీకే వెబ్‌సైట్‌లోనూ ఆమె తప్ప మరొకరు లేరని, ఆమె పగ్గాలు చేపట్టాల్సిందేనని కేడర్‌ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో డీఎండీకే కార్యాలయం నుంచి ప్రేమలత ప్రధాన కార్యదర్శి అన్న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువేనని ఓ నేత పేర్కొన్నారు. విజయకాంత్‌ బావమరిది సుధీష్‌ ఆ పార్టీ యువజన నేతగా ఉన్నా, పార్టీని నడిపించే సత్తా మాత్రం ప్రేమలతకు మాత్రమే ఉందని, ఆమె పగ్గాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయంగా ఆ నేత వ్యాఖ్యానించడం గమనార్హం.

మరిన్ని వార్తలు