ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేరా?

27 Feb, 2014 02:37 IST|Sakshi
  • కాంగ్రెస్‌కు రాజ్‌నాథ్ సింగ్ సవాల్
  •  మొయిలీని ఇంటికి పంపించాలని పిలుపు
  •  మోడీని గెలిపిస్తే వాజ్‌పేయి పాలన
  •  ఓటమి తప్పదని కాంగ్రెస్‌కు తెలిసిపోయింది
  • దొడ్డబళ్లాపురం/శివమొగ్గ, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల్లో దేశంలో ఎక్కడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవని, ఆ నమ్మకం లేకే రాహుల్‌ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందని, దమ్ముంటే కాంగ్రెస్ రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సవాల్ విసిరారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘భారత్‌ను గెలిపించండి’ పేరిట బుధవారం  ఆయన దొడ్డబళ్లాపురంలో కార్యకర్తల సమావేశంలో, శివమొగ్గలో బహిరంగ సభలో మాట్లాడారు.

    పదేళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.5 లక్షల కోట్లకు పైగా అవినీతి జరిగితే ఏనాడూ పెదవి విప్పని రాహుల్, నేడు లోక్‌సభ అవధి ముగుస్తున్న సమయంలో అవినీతి నియంత్రణకు కొత్త ఆర్డినెన్స్ తేవాలని ప్రయత్నిస్తుండటం తమాషాగా ఉందన్నారు. ఇదే జరిగితే తాను రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని విజ్ఞప్తి చేస్తాన ని చెప్పారు. అవినీతిని అంతమొందించాలనే ఉబలాటం అంతగా ఉంటే వారి పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

    ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశంతోనే తయారు చేస్తోందన్నారు. కాంగ్రెస్ అవినీతి పాతాళం, భూమి, ఆకాశాలలో సైతం వ్యాపించిందన్నారు. సెక్యులర్ పేరుతో మత విద్వేషాలు రగిలించేది కాంగ్రెస్సేనన్నారు. కాంగ్రెస్ చేతగాని పాలనతో చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయన్నారు. గా్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ విభజించి పాలించే విధానాన్ని అమలు చేస్తుందని, బీజేపీ అందరినీ కలుపుకుపోతూ పాలిస్తుందన్నారు.

    కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా 2019 ఎన్నికలకు సిద్ధమవుతోందని వ్యంగ్యంగా అన్నారు.  కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా వెలువరించిన పోస్టర్లలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దర్శనమిస్తారు... ప్రధాని అభ్యర్థిగా మాత్రం ముందుకు రారు అని ఎత్తిపొడిచారు. నిరుద్యోగం విలయ తాండవం చేస్తోందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. దేశానికి ఇంటా, బయటా భద్రత కొరవడిందని ఆరోపించారు. ఎన్నికల్లో యడ్యూరప్పను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఆయన ఓటర్లను కోరారు. 2014లో ఓటమి తప్పదని కాంగ్రెస్‌కు తెలిసిపోయిందన్నారు.

    ఎన్నికల తరువాత దేశంలో కొత్త ఒరవ డి రానుందని, మోడీ ప్రధాని అయితే వాజ్‌పేయి పాలన మళ్లీ వస్తుందన్నారు. ఈసారి ఎన్నికల్లో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని చిత్తుగా ఓడించి బీజేపీ అభ్యర్థి బచ్చేగౌడను గెలిపిస్తానని కార్యకర్తలు మాటివ్వాలన్నారు. దేశ ప్రజలందరూ మోడీని ప్రధానిని చేయాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ అనంత కుమార్ మాట్లాడుతూ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీపై నిప్పులు చెరిగారు. మొయిలీకి చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, రాష్ట్రం గురించి ఏమీ తెలీదని, గెలిపిస్తే వెళ్లి ఢీల్లీలో కూర్చొని మళ్లీ ఐదేళ్లకు కనిపిస్తారన్నారు.

    అబద్దాలనే జన్మహక్కుగా చేసుకుని మాట్లాడే మొయిలీ వలస పక్షిలాంటి వాడని ఎద్దేవా చేశారు. మంగళూరులో చిత్తుగా ఓడి ఇక్కడకు వలస వచ్చి ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఈ ప్రజలకే ద్రోహం చేశారన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలిపించడం ద్వారా మోడీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, సదానంద గౌడ, మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్ అశోక్, సినీ నటి మాళవిక, ఎంపీ అభ్యర్థి బచ్చేగౌడ, కేఎస్. ఈశ్వరప్ప, బసవరాజ్ బొమ్మయ్, శోభా కరంద్లాజె, సీఎం. ఉదాసీ, బీవై. రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు