కరోనా ఉందంటూ నాటకమాడి ఖైదీ పరారీ

30 Apr, 2020 07:15 IST|Sakshi

సాక్షి, చెన్నై : కరోనా వైరస్‌ లక్షణాలను ఒక ఖైదీ తనకు అనుకూలంగా మలచుకున్నాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా శ్రీవైంకుఠంకు చెందిన మాయండి అనేక దోపిడీ, చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతడి కోసం పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. అయితే గత వారం ఆళ్వార్‌ తిరునగర్‌లో జరిగిన ఓ దోపిడీ కేసులో మాయాండిని ఎట్టకేలకు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకుడి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచానంతనరం తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలోని కేంద్రకారాగారానికి సాయంత్రం తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వాహనంలో ఎక్కించుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో మాయాండి కరోనా వైరస్‌ లక్షణాలున్నట్లుగా ప్రవర్తించాడు. మార్గం మధ్యలో అదే పనిగా దగ్గడం, తుమ్మడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. తనకు జ్వరం, జలుబు దగ్గు ఉందని పేర్కొంటూ ఇది  కరోనా ప్రభావం ఏమో అని పేర్కొన్నాడు. దీంతో భద్రతా సిబ్బంది హడలెత్తారు. రాత్రి ఏడు గంటల సమయంలో అతడ్ని పాళయం కోట్టై మార్గంలో ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎందుకైనా మంచిదనుకున్న పోలీసులు  అతడికి కాస్త  దూరంగానే ఉన్నారు. దీనిని పరిగణించి మాయాండి వైద్యుల వద్ద మరుగుదొడ్డికి వెళ్తున్నట్టు చెప్పి జారుకున్నాడు.(కరోనా : 40 రోజుల బతుకు లాక్‌డౌన్)‌


పరారీలో ఉన్న ఖైదీ కోసం ఆరా తీస్తున్న పోలీసులు
ఈ మాయగాడి కోసం తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లా పోలీసులు వేట మొదలెట్టారు. దీంతో పోలీసులు తూత్తుకుడి, తిరునల్వేలి పరిసరాల్లో ఉన్న 25 చెక్‌ పోస్టులలో గాలింపు చేపట్టారు. విషయాన్ని ముందే ఊహించిన మాయాండి వేందనాకులం నదిలో ఈదుకుంటూ ఉడాయించడం గమనార్హం. మాయండి బంధువు ఒకరు సమాచారం అందించడంతో ఫైబర్‌ పడవల్ని రంగంలోకి దించి నదిలో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 'మాయాండి ..వాంటెడ్‌' అంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో అతడి ఫోటోల్ని షేర్‌ చేశారు. అలాగే, అతడికి భద్రత నిమిత్తం వచ్చి నలుగురు పోలీసులకు ముందస్తుగా పాళయం కోట్టై కరోనా కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు.

పోలీసునే చితక్కొట్టాడు..
లాక్‌ డౌన్‌వేళ పోలీసులు లాఠీలకు పని పెట్టిన సంఘటనలు అనేకం. అయితే, మాస్క్‌ ధరించ లేదని తనను ప్రశ్నించడాన్న ఆగ్రహంతో ఓ టీ వ్యాపారి పోలీసును చితక్కొట్టాడు. తంజావూరు జిల్లా తిరునంతాల్‌ గ్రామంలో సైకిల్‌ మీద ఓ వ్యాపారి టీ విక్రయిస్తూ వచ్చాడు. లాక్‌ డౌన్‌ వేళ ఎవరు బయటకు రాకూడదన్న నిబంధనలు ఉన్నా అది లెక్కచేయకుండా ఆ వ్యాపారి రోడ్డుమీదకు వచ్చాడు. అయితే భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆ వ్యాపారి పోలీసు మీద తిరగబడి చేతిలోని లాఠీ లాక్కుని చితక్కొట్టేశాడు. లాఠీ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్‌ యత్నించాడు. చివరకు జనం అడ్డుకోవడంతో వ్యాపారి ఉడాయించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  

మరిన్ని వార్తలు