సదువులు సగం!

21 Oct, 2016 14:56 IST|Sakshi
సదువులు సగం!
సమస్యలు అధికం
జూనియర్‌ కళాశాలలో విడతలవారీ బోధన
అస్తవ్యస్త తరగతులతో ఇక్కట్లు
శిథిలమైన బాలికల కళాశాల
జిల్లా కేంద్రంలో విద్యార్థుల అవస్థ
 
మెదక్‌ జోన్:  విడతలవారీ బోధన.. విద్యార్థులను ఇక్కట్లకు గురిచేస్తోంది. ఒకే కళాశాలలో ఉదయం బాలికలకు, మధ్యాహ్నం వేళ బాలురకు తరగతులు బోధిస్తున్నారు.  సమయభావంతో అరకొరగా జరుగుతున్న తరగతులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరకొర చదువులతో వారి భవిష్యత్తు సందిగ్ధంలో పడుతోంది.  మెదక్‌ పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ సమీపంలోని బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని నలభై ఏళ్ల క్రితం నిర్మించారు. అందులోనే కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆ భవనంలోనే దాదాపు 550మంది విద్యార్థినులు చదువుకుంటుండగా.. గత నెల మొదటివారంలో భారీ వర్షాలకు కళాశాలలోని గదులన్నీ దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. ఓ గది పూర్తిగా కూలిపోయింది. ఆందోళనకు గురైన ఉపాధ్యాయులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. పట్టణంలోని బాలుర కళాశాలలోకి తరలించాలని చెప్పారు. వారి ఆదేశాలతో విద్యార్థులను అక్కడకు తరలించారు. రెండు కళాశాలల విద్యార్థులకు విడతల వారీగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. బాలికలకు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు; బాలురకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బోధిస్తున్నారు. సమయాభావంతో అరకొరగా జరుగుతున్న తరగతులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధ్యాపకులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పునశ్చరణకు కూడా సమయం ఉండడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు ఉదయం పూట సమయానికి బస్సులు అందుబాటులో లేక దూరప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థినులు తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో తరగతులకు హాజరు కాలేకపోతున్నామని పలువురు విద్యార్థినులు వాపోయారు. సర్ధన, కొత్తపల్లి, కొడుపాక, డి.ధర్మారం, రంగంపేట, గోపాల్‌పేట, గుండారం తదితర దూర ప్రాంతాల నుంచి బాలికలు మెదక్‌ పట్టణానికి కళాశాలకు వస్తూంటారు. 
 
సాయంత్రం వేళల్లోనూ కళాశాల సమయం కన్నా ముందే బస్సులు వెళ్లిపోయి విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 5.30గంటల వరకు తరగతులు జరుగుతుండడంతో బస్సులు దొరకడవం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థులకు రెండు విడతల్లో నామమాత్రంగా చదువులు చెబుతూ కాలం వెళ్లదీస్తుండడంపై పలువురు అధ్యాపకులు కూడా అసంతృప్తితో ఉన్నారు. తమకు మరేదైనా భవనాన్ని కేటాయించి యథావిధిగా కళాశాల నిర్వహణ కొనసాగించాలని విద్యార్థినులు కోరుతున్నారు. 
 
ఇబ్బందులు తప్పడం లేదు 
కళాశాల భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో బాలుర కళాశాలకు  తరలించాం. అక్కడ గదులు సరిపడా లేకపోవడంతో విడతల వారీగా తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. కళాశాల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. రూ.26లక్షలు మంజూరు చేశారు. ఇప్పుడు టెండర్‌ దశలో ఉంది. టెండర్‌ పూర్తవగానే పనులు ప్రారంభమవుతాయి. 
రమాదేవి, ప్రిన్సిపాల్, బాలికల కళాశాల 
 
బస్సులు దొరకడం లేదు 
సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు జరగడంతో ఊరికి వెళ్లేందుకు బస్సులు దొరకడం లేదు. అన్ని బస్సులూ వెళ్లిపోవడంతో ఆటోలకు ఛార్జీలు చెల్లించి వెళ్లాల్సి వస్తోంది. ఇదివరకటి లాగే మాకు తరగతులు కొనసాగించాలి. 
 శ్రీకాంత్, సెకండియర్‌ విద్యార్థి 
మరిన్ని వార్తలు