మానసిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించాలి

11 Oct, 2013 01:52 IST|Sakshi

రాయచూరు, న్యూస్‌లైన్ : మానసిక ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ ప్రాధికారం అధ్యక్షులు కృష్ణభట్ అన్నారు. ఆయన గురువారం స్థానిక ఐఎంఏ హాల్‌లో జిల్లా న్యాయసేవ ప్రాధికారం, జిల్లా న్యాయవాదుల సంఘం, భారతీయ వైద్యకీయ సంఘం, ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

ఇటీవల మానసిక అస్వస్థుల సంఖ్య పెరుగుతోందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. శారీరక ఆరోగ్య నియంత్రణ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని, దీంతో మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్ల పర్యవసానంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. మారిన జీవన శైలి ఒత్తిళ్లు పెరగడానికి కారణమన్నారు.సమాజంలో చక్కటి నాగరికతను అలవాటు చేసుకోవడం ప్రధానమన్నారు.

మానసిక అస్వస్థులను హింసించడం, వేధించడం వంటి పనులకు సమాజం స్వస్తి చెప్పాలని కోరారు. అలాంటి వారికి తగిన చికిత్స ఇప్పించేందుకు ఆసక్తి చూపాలన్నారు. అంతకుముందు సైకియాట్రిస్ట్ డాక్టర్ మాలిపాటిల్ మానసిక ఒత్తిళ్ల పరిణామాల గురించి వివరించారు. న్యాయమూర్తి ముజాహిద్, జిల్లాధికారి నాగరాజ్, ఎస్పీ ఎంఎం.నాగరాజ్, నవోదయ కళాశాల డీన్ డాక్టర్ ప్రకాష్, ఐఎంఏ అధ్యక్షుడు కులకర్ణి, విమ్స్ మనోవైద్యుడు రమేష్‌బాబు, మనోహర్ , న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు భా నురాజ్  జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షే మ అధికారి డాక్టర్ నారాయణప్ప, వై ద్యులు, న్యాయవాదులు  పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు