తాయిలాల మయం!

19 Feb, 2014 23:05 IST|Sakshi

పింప్రి, న్యూస్‌లైన్: పుణే కార్పొరేషన్ బడ్జెట్ స్థాయీ సమితి అధ్యక్షుడు విశాల్ తాంబే మంగళవారం 2014-15 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను సమర్పించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించినట్లు బడ్జెట్ ద్వారా స్పష్టం అవుతోంది. నగరవాసులపై ఎలాంటి పన్నులను పెంచకుండా నగర ప్రజలను ఆకర్షించే విధంగా పలు పథకాలకు శ్రీకారం చుట్టేందుకు బడ్జెట్‌లో చూపారు. పుణేను టూరిస్ట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, చారిత్రాత్మక నిర్మాణాలకు తిరిగి మెరుగులు దిద్దే విషయమై బడ్జెట్‌లో తాంబే ప్రాముఖ్యమిచ్చారు. ముఖ్యంగా నగరవాసుల చిరకాల స్వప్నమైన మెట్రో, మోనోలకు బడ్జెట్‌లో నిధులను కేటాయించారు.

 బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఇలా ఉంది.. మెట్రోకు రూ.25 కోట్లు, మోనోకు రూ.15 కోట్లు, కొత్తగా కార్పొరేషన్‌లో చేరే 34 గ్రామాల అభివృద్ధి కోసం రూ.20 కోట్లు, ఎస్‌సీఎంటీఆర్ ఏర్పాటుకు రూ. ఏడు కోట్లు, బయోగ్యాస్, చెత్త నిర్మూలనకు రూ.6.20 కోట్లు, నగరంలో పేదల మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు, బాలభవన్‌లకు రూ. కోటి, బాలికల పాఠశాలలకు రూ.కోటి, రహదారుల అభివృద్ధికి రూ.557.81 కోట్లు, జోపిడిపట్టి పునరావాసం కోసం రూ.46.62 కోట్లు, పీఎంపీఎంఎల్‌కు రూ.27 కోట్లు, వాతావరణ కాలుష్య నివారణకు రూ.13 కోట్లు కేటాయించారు. నగరంలో కొత్తగా 34 గ్రామాలు విలీనం కావడంతో కనీస అవసరాలైన రోడ్లు, నీరు, ట్రాఫిక్, ఫ్లైఓవర్, చెత్త నిర్మూలన, డ్రైనేజ్ వ్యవస్థలకు ప్రాధాన్యం కల్పించారు. నగర ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతలో భాగంగా విద్యార్థులు, మహిళలు, పురుషులు, వృద్ధులకు ప్రత్యేకంగా పలు పథకాలను ప్రవేశపెట్టారు.

ఇదిలా ఉండగా ఎల్బీటీ ద్వారా రూ.200 కోట్ల ఆదాయం, సాధారణ పన్నుల ద్వారా రూ.150 కోట్లు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.100 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు, నీటి పన్ను, కట్టడాలు, ఇతర ఉత్పాదక వస్తువుల ద్వారా రూ.91 కోట్ల ఆదాయం చేకూరుతుందని కార్పొరేషన్ అంచనావేసింది. పెట్రోలు, మందులు, అప్పులను తిరిగి ఇవ్వడం, సేవక వర్గాల ఖర్చు సుమారు రూ.100 కోట్ల వరకు తగ్గించాలని బడ్జెట్‌లో పొందుపర్చారు. కాగా, కార్పొరేషన్‌కు ఎల్బీటీ ద్వారా 45 శాతం, నగరాభివృద్ధి చార్జీల ద్వారా 22 శాతం, పన్నుల ద్వారా 19 శాతం, ఇతరత్రా జమల ద్వారా 9 శాతం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంల ద్వారా 5 శాతం, నీటి పన్నుల ద్వారా 3 శాతం వనరులు కార్పొరేషన్‌కు సమకూరనున్నాయి.

 కాగా కార్పొరేషన్ అభివృద్ధి పనులు, ఇతర ప్రాజెక్టులకు 45 శాతం, సేవక వర్గానికి 20 శాతం, పెట్రోలు, ఇతర ఖర్చులకు 11 శాతం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఖర్చులకు 9 శాతం, ప్రాథమిక విద్యకు 3 శాతం, విద్యుత్ ఖర్చులు, నీటి సరఫరాకు, వార్డుల వారీ అభివృద్ధి పనులకు, అప్పులు, వాటిని తిరిగి చెల్లింపులకు, మొత్తం కలిపి 4 శాతం ఖర్చు చేయనున్నారు.

మరిన్ని వార్తలు