భర్తనే అంతమొందించింది

25 Apr, 2014 02:09 IST|Sakshi

కాబోయే అల్లుడితో కలిసి ఘాతుకం
మహిళతో సహా ముగ్గురి అరెస్ట్

 
బెంగళూరు, న్యూస్‌లైన్ : కాబోయే అల్లుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించిన మహిళతో సహ ముగ్గురిని ఇక్కడి మైకోలేఔట్ పోలీసులు అరెస్టు చేశారు. మైకో లేఔట్ సమీపంలోని భారతీ లేఔట్ మూడవ క్రాస్‌లో నివాసం ఉంటున్న ఉషారాణి (38), మహేష్ (24) (ఇతను ఉషారాణి రెండవ కుమార్తె ప్రియుడు), మహేష్ బంధువు సురేష్‌లను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వివరాలు...  మునిరాజు (46), ఉషారాణి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రెండవ కుమార్తె, మహేష్ ప్రేమించుకుంటున్నారు. మార్చి 21న ఉదయం 11 గంటలకు బయటకు వెళ్లిన తన భర్త మునిరాజు తిరిగి రాలేదని ఉషారాణి మైకో లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కోసం గాలించారు.

ఫలితం లేకపోవడంతో కరపత్రాలు ముద్రించిన పోలీసులు తుమకూరు, గౌరిబిదనూరు, కోరటగెరె, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం తదితర చోట్ల పంచిపెట్టారు. అయినా మునిరాజు ఆచూకీ లభించలేదు. ఈ విషయంపై పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఉషా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు పోలీసులను పిలిచి దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో ఆరాతీసి మునిరాజు అదృశ్యంపై తేల్చాలని ఆదేశించింది. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు.
 
ఉషారాణి వైఖరిపై పోలీసులకు సమాచారం
 
మునిరాజు స్నేహితులు విజయ్‌కుమార్, ప్రకాష్‌రెడ్డి ఈనెల 21న పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. మునిరాజు కేసు దర్యాప్తు గురించి అడిగారు.  మునిరాజు భార్య ఉషారాణి, కాబోయే అల్లుడు మహేష్‌తో జల్సాగా తిరుగుతోందని వారిద్దరిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఉషాపై నిఘా పెట్టారు. భర్త కనిపించకపోయి రోజులు గడచినా ఆమెకు కొంచెం కూడా బాధ కనిపించలేదు.
 
దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా దిగ్భ్రాంతి గురయ్యే విషయాలు వెల్లడించారు. భర్తను చంపి పోలీసులు, హైకోర్టును తప్పుదోవపట్టించారని తెలుసుకున్నారు. మార్చి 21వ తేది మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న మునిరాజుకు ఉషారాణి మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. మత్తులో జారుకున్న అతడిని మహేష్, సురేష్‌లు తల దిండు ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. మరుసటి రోజు వేకువజామున కారులో మృతదేహాన్ని తీసుకుని బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటే తాలుకా అప్పసంద్ర గ్రామం శివార్లలోని నీలగిరి తోటలోకి వెళ్లారు. మృతదేహాంపై పెట్రోల్ పోసి తగలబెట్టి వెనుతిరిగి వచ్చేశారు.
 
నిత్యం వేధింపులు :  ఉషారాణి

 
ప్రతి రోజు మద్యం తాగి వచ్చి తనను వేధించేవాడని, కుమార్తెల ఎదుటే దుర్భాషలాడేవాడని ఉషారాణి పోలీసులు విచారణలో వెల్లడించారు. అదే విధంగా రెండవ కుమార్తె, మహేష్‌ల వివాహనికి అడ్డుపడ్డాడని, అందుకే హత్య చేశామని ఉషారాణి, మహేష్ విచారణలో అంగీకరించారని ఔరాద్కర్ తెలిపారు.
 
రూ. లక్ష జరిమానా
తన భర్త కనపడటం లేదని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన ఉషారాణికి గురువారం హైకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. మునిరాజు అదృశ్యం కాలేదని హత్యకు గురయ్యాడని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం తప్పుడు ఫిర్యాదు చేసి కోర్టును తప్పదోవపట్టించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు