పుత్తూరు ఆపరేషన్ సక్సెస్

6 Oct, 2013 03:39 IST|Sakshi
పుత్తూరు, న్యూస్‌లైన్:జిల్లాలో తీవ్రవాదుల ఉనికి చోటుచేసుకోవడం ఇదే ప్రథమమని జిల్లా ఎస్పీ క్రాంతి రాణాటాటా తెలిపారు. శనివారం పుత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇస్లామిక్ ఉగ్రవాదులైన బిలాల్, ఇస్మాయిల్‌లను పుత్తూరులో అదుపులోకి తీసుకోవడానికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందన్నారు. చెన్నైలో పట్టుబడిన ఉగ్రవాది పోలీస్ ఫకృద్దీన్‌ను విచారించగా పుత్తూరులో మరికొందరు ఉన్నట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. దీని ఆధారంగా తమిళనాడు పోలీసులు తీవ్రవాదులను పట్టుకోవడానికి తనను సంప్రదించడంతో నగరి పోలీసుల సాయాన్ని తీసుకోవాలనే సూచనల మేరకు శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తమిళనాడుకు చెందిన సీఐ లక్ష్మణ్ బృందం గేటు పుత్తూరులో తీవ్రవాదులు ఉన్న ఇంటి తలుపులు తట్టారన్నారు.
 
 ఉగ్రవాదులు అప్రమత్తమై సీఐ లక్ష్మణ్‌ను లోపలికి లాగి ఆయన తలపై తీవ్రంగా గాయపరచడంతో అక్కడే ఉన్న పోలీసులు కాల్పులు జరిపారన్నారు. దీంతో ఉగ్రవాదులు గాయపడిన సీఐ లక్ష్మణ్‌ను బయటకు తోసేసి తలుపులు వేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఇస్మాయిల్ అనే ఉగ్రవాది కాలికి బుల్లెట్ గాయం తగిలినటు ్లపేర్కొన్నారు. ఆక్టోపస్ కమాండోలు రంగంలోకి దిగి తీవ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టుముట్టి ఇంటిపై నుంచి రంధ్రంలో టియర్ గ్యాస్ విడుదల చేశారని తెలిపారు. దీంతో ఊపిరాడ క ఉగ్రవాది బిలాల్ తన భార్య, ముగ్గురు పిల్లలను బయటకు పంపించేశారని పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని ఇంటిలోపలున్న బిలాల్, ఇస్మాయిల్‌ను బయటకు రావాలని పోలీసులు హెచ్చరించడంతో వారు స్పందించలేదన్నారు. దీంతో మరోసారి టియర్ గ్యాస్ వదలడంతో వారు ఎట్టకేలకు ఊపిరాడక వెలుపలికి రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారందరిని తమిళనాడు ఐజీ కన్నప్ప, సీబీసీఐడీ ఎస్పీ అన్బు, డీఎస్పీ నరేంద్రపాల్‌సింగ్‌లకు అప్పగించడంతో తీవ్రవాదులను చెన్నైకు తరలించారని వివరించారు.
 
మరిన్ని వార్తలు