ప్రశ్నపత్రాలన్నీ లీక్

6 Apr, 2016 02:44 IST|Sakshi

సీఐడీ దర్యాప్తులో వెల్లడి
సూత్రధారి మాజీ అధ్యాపకుడు శివకుమార్‌స్వామి?
సీఐడీ అదుపులో శివకుమార్‌స్వామి
ఈ కేసులోమరో ఐదుగురి పాత్ర
వారి కోసం గాలిస్తున్న   దర్యాప్తు బృందాలు 


బెంగళూరు: ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం లీకుకు సంబందించిన దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగుచూస్తున్నాయి. కేవలం రసాయనశాస్త్రమే కాకుండా  గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా పరీక్షకు ముందే బయటికి వచ్చినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం లీకుకు సంబంధించి సూత్రధారి తుమకూరుకు చెందిన శివకుమార్‌స్వామి అని తేలింది. ఇతను గతంలో లెక్చరర్‌గా పనిచేసి అక్రమాలకు పాల్పడి విధుల నుంచి డిస్మిస్ అయినట్లు తేలింది. ఈ ఏడాది మార్చి 21న నిర్వహించాల్సిన ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్ర పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రెండు సార్లు లీక్ కావడంతో ఈనెల 12న ఈ  పరీక్షను నిర్వహించనున్న విషయం తెలిసిందే. రెండు సార్లు ప్రశ్నపత్రం లీకుకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ బృందం అధికారులు ఈ అక్రమ దందా వెనుక వివిధ అరోపణలతో విధుల నుంచి డిస్మిస్ అయిన లెక్చరర్ శివకుమార్‌స్వామి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా కాగేరికి చెందిన ఇతను బెంగళూరులోని వివిధ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేస్తూ మొదటి నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ, సీఈటీ వంటి పరీక్ష పత్రాల లీకుల దందాకు పాల్పడేవాడు. ఈ విషయమై ఇతనిపై ఇప్పటికే మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.


ఇందులో బెంగళూరులోని రాజాజీనగర, చంద్రలేఅవుట్ పోలీస్ స్టేషన్లలో తలా ఒకటి కాగా, తుమకూరులో రెండు కేసులు నమోదయ్యాయి. ఇతని కుమారుడైన దినేష్, సోదరుడి కుమారుడు కిరణ్ ఈ దందాలో భాగస్వాములని తెలుస్తోంది. దినేష్ ఎంబీబీఎస్‌ను మధ్యలోనే మానేశారని సమాచారం. మొదట్లో కిరణ్ ఈ లీకుకు సూత్రధారి అని భావించినా మరింత లోతుగా అధ్యయనం చేయడంతో శివకుమార్‌స్వామి అసలు సూత్రధారి అని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఈ ముగ్గురితో పాటు మరో ఐదు మంది పాత్ర ఉన్నట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. వీరి కోసం లీకు కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ దర్యాప్తు బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. ఇదిలా ఉండగా విధుల నుంచి డిస్మిస్ అయిన తర్వాత శివకుమార్‌స్వామీ వివిధ చోట్ల ట్యుటోరియల్స్ నిర్వహిస్తూ పీయూ బోర్డులో ఉన్నతాధికారులతో నిత్యం సంప్రదింపులు జరిపేవారు. అంతేకాకుండా  ప్రశ్నపత్రాల రవాణా కోసమంటూ ట్యుటోరియల్స్‌కు చెందిన వాహనాలను పీయూబోర్డుకు అందజేసి ఆమేరకు అధికారుల మెప్పు పొందేవారని తెలుస్తోంది. రవాణా కోసం వినియోగించే వాహనంలో ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు సిబ్బందిని కూడా శివకుమారస్వామి ప్రసన్నం చేసుకునేవాడు. ఇలా ఉన్నతస్థాయి అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరినీ ప్రలోభాలకు గురిచేసి ప్రశ్నపత్రాలను లీకు చేసే వాడని సీఐడీ దర్యాప్తులో తేలింది. కాగా, రాష్ట్రం మొత్తం మీద వివిధ పేర్లతో  18 ట్యుటోరిల్స్‌ను శివకుమారస్వామి నిర్వహిస్తున్నారని సీఐడీ అధికారులు గుర్తించారు.
 

విధానసౌధ కేంద్రంగా లీకు వ్యవహారం...
ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం లీకు కేసుకు సంబంధించి రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాష్ పాటిల్ పీ.ఏ ఓబుళరాజు, ప్రైవేటు కళాశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న మంజునాథ్, ప్రజాపనుల శాఖలో పనిచేస్తున్న రుద్రప్పలను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో లీకుకు సంబంధించి మొత్తం వ్యవహారం విధానసౌధలోని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్‌ప్రకాష్ పాటిల్ కార్యాలయం నుంచి జరిగినట్లు సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. ఓబుళరాజు కుమారుడు, రుద్రప్పల కుమార్తె ద్వితీయ పీయూసీ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో మంజునాథ్ నుంచి ప్రశ్నపత్రం వాట్స్‌అప్ ద్వారా ఓబుళరాజు కుమారుడు, , రుద్రప్ప  కుమార్తెకు చేరింది. అంతేకాకుండా చేతితో రాసిన సదరు ప్రశ్నపత్రం విధానసౌధాలోని మంత్రి కార్యాలయం ముందే మంజునాథ్ ఓబుళరాజుకు అందజేసి ఇందుకోసం లక్షల నగదు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఓబుళరాజు, రుద్రప్పలు మంత్రి కార్యాలయం నుంచే పలువురికి ప్రశ్నపత్రం అమ్మారు. ఇందుకు కార్యాలయం ల్యాడ్‌లైన్ ఫోన్‌ను వినియోగించుకున్నారు. తాను ఎవరెవరికి ఎలా ప్రశ్నపత్రాన్ని చేరవేసింది మంజునాథ్ సీఐడీ విచారణలో పూసగుచ్చినట్లు తెలిపినట్లు అధికార వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా  లీకులకుసంబంధించిన సూత్రధారి శివకుమార్‌స్వామీని సీఐడీ అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

>
మరిన్ని వార్తలు