ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అరెస్టు

13 Feb, 2017 12:24 IST|Sakshi
ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు పట‍్టణ దాహార్తి తీర్చాలని కోరుతూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం 10 గంటలకు జలదీక్ష ప్రారంభించిన ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల‍్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిని పోలీసులు మళ్ళీ అరెస్టు చేశారు. ఆదివారం అర‍్థరాత్రి పోలీసు బలగంతో దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించిన విషయం విదితమే. అయితే ఆయన సోమవారం ఉదయం తన అనుచరులతో వచ్చి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట జలదీక్ష మొదలుపెట్టారు. ఈ దీక్ష మంగళవారం ఉదయం 10 గంటలకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే దీక్ష ప్రారంభించిన కాసేపటికే పెద‍్దఎత్తున పోలీసులు వచ్చి ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు.
 
ప్రొద్దుటూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే రాచమల్లు మున్సిపల్‌ కార్యాలయం వద్ద జల దీక్ష చేపట్టారు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు వేలాది మంది మద్దతుతో దీక్ష చేయనున్నారు. ప్రధానంగా ప్రతి ఏటా మైలవరం డ్యాం నుంచి టీఎంసీ నీటిని పెన్నానదిలోకి విడుదల చేసేందుకు శాశ్వత జీఓను విడుదల చేయాలని, కుందూ పెన్నా వరద కాలువ పనులకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని, చెన్నమరాజుపల్లె సమీపం నుంచి రామేశ్వరం హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వరకు పైపులైన్‌ ద్వారా వరద నీటిని తరలించాలని, తాత్కాలికంగా సమస్య పరిష్కారం కోసం పట్టణంలోని 40 వార్డులకు రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన దీక్షకు మైదుకూరు శాసనసభ‍్యుడు రఘురామిరెడ్డి మద‍్దతు పలికారు.
 
అర‍్థరాత్రి పోలీసులు, అధికారుల హడావుడి
ప్రొద్దుటూరు నీటి సమస‍్యలపై ఆదివారం అర‍్థరాత్రి నుంచి జలదీక్ష చేయాలని ఎమ్మెల్యే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అర్ధరాత్రి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటశివారెడ్డి, పోలీసులు జలదీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించేందుకు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చేపట్టనున్న 24 గంటల జలదీక్షా శిబిరాన్ని తొలగించే యత్నం చేస్తున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చారు. నీళ్లు ఇవ్వలేని అధికారులు సిగ్గు లేకుండా శిబిరాన్ని ఎలా తొలగిస్తారంటూ కమిషనర్‌ను మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మురళీధర్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఒక్క సారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మా ఇళ్ల వద్దకు వచ్చి ప్రజలు బూతులు తిడుతున్నారని, మీ ఇళ్లల్లో మినరల్‌ వాటర్‌తో నీళ్లు పోసుకుంటూ ప్రజల గురించి ఆలోచించరా అని నాయకుడు బంగారురెడ్డి అన్నారు.
 
వంద కోట్లు మున్సిపాలిటీలో పెట్టుకొని ప్రజలకు పది రోజులకు ఒక సారి కూడా నీళ్లు ఇవ్వలేరా అని శాసనసభ‍్యుడు రాచమల్లు అన్నారు. వన్‌టౌన్‌ సీఐ బాలస్వామిరెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌లు ఎమ్మెల్యే వద్దకు వచ్చి బోర్లు వేస్తున్నామని నీళ్లు రెండు రోజుల్లో ఇస్తామని తెలిపారు. ఎక్కడ బోర్లు వేశారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన డిమాండ్లు మైలవరం జలాశయం నుంచి 1 టీఎమ్‌సీ నీటిని పెన్నాకు వదలించడం, కుందూపెన్నా కాలువను పూర్తి చేయడం, కుందూ నుంచి పైప్‌లైన్‌ పనులు ప్రారంభించడం అని తెలిపారు. తనకు మీరు చెప్పే విషయాలపై నమ్మకం లేదని జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ వచ్చి హామీ ఇస్తే 24 గంటల దీక్ష కూడా విరమిస్తానని చెప్పారు. 

 

మరిన్ని వార్తలు