విశాల్‌ మంచివాడు కాదని తెలిసిపోయింది

14 May, 2019 11:28 IST|Sakshi
నటి రాధికాశరత్‌కుమార్‌ ,విశాల్‌

చెన్నై ,పెరంబూరు: నటుడు విశాల్‌ మంచివాడు కాదని అందరికీ తెలిసిపోయిందని నటి రాధికా శరత్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. విశాల్‌ బృందానికి ఓటమి తప్పదన్నారు. 2015లో జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో అప్పటి సంఘ అధ్యక్షుడు శరత్‌కుమార్‌కు పోటీగా విశాల్‌ బరిలోకి దిగి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఆ తరువాత విశాల్‌ బృందం శరత్‌కుమార్, రాధారవిలు నడిగర్‌ సంఘంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సంఘానికి చెందిన సెంగల్‌పట్టులోని స్థలాన్ని అమ్ముకున్నారనే కేసు ఇప్పటికీ కోర్టు విచారణలో ఉంది. దీంతో నటి రాధిక శరత్‌కుమార్‌ అప్పట్లో విశాల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో విశాల్‌ బృందం మళ్లీ పోటీకి సిద్ధం అవుతోంది.

ఈ నేపథ్యంలో వారికి పోటీగా రాధికా శరత్‌కుమార్‌ ఎన్నికల బరిలో ఢీ కొనడానికి రెడీ అవుతున్నట్టు, సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని టీవీ ఛానెళ్లలోనూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయం గురించి స్పందించిన రాధికా శరత్‌కుమార్‌ తాను గానీ, తన భర్త శరత్‌కుమార్‌ గానీ నడిగర్‌ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచన గానీ, ఆసక్తిగానీ లేదన్నారు. తమకు అంత సమయం లేదని వ్యాఖ్యానించారు. అయితే నటుడు విశాల్‌ మంచి వాడు కాదన్న విషయం అందరికీ తెలిసిందని అన్నారు. అందుకు తమకు సంతోషంగా ఉందన్నారు. తాను గత నెల 7వ తేదీనే షూటింగ్‌ నిమిత్తం కేరళాకు వెళ్లినట్లు తెలిపారు. కాగా తన సోదరుడు పోటీ చేస్తున్నాడా? అనే విషయాన్ని తనకు తెలియదన్నారు. అయితే ఎన్నికల్లో విశాల్‌కు వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వారికి తమ మద్దతు ఉంటుందని రాధికా శరత్‌కుమార్‌ వెల్లడించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు