రాధికా శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తాం

27 Dec, 2015 08:32 IST|Sakshi
రాధికా శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తాం

తమిళసినిమా: నటి రాధిక శరత్‌కుమార్‌కు నోటీస్ జారీ చేస్తామని దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాల గురించి చర్చించినట్లు తెలిసింది.అయితే తమిళనాడు యావత్తు ప్రకంపనలు సృష్టిస్తున్న శింబు బీప్ సాంగ్ వ్యవహారం చర్చకు రానట్టు సమాచారం.
 
 అనంతరం విలేకరుల ప్రశ్నలకు సంఘం సభ్యులు బదులిచ్చారు.ముఖ్యంగా శింబు విషయంలో సంఘం జోక్యం చేసుకోలేదన్న నటి రాధిక శరత్‌కుమార్ ఆరోపణపై స్పందిస్తూ రాధిక శరత్‌కుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు. వాస్తవానికి శింబు బీప్ సాంగ్ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదించామన్నారు. అయితే ఆ సమస్యను వారు కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారని వివరించారు. అంతే కాదు ఈ విషయమై శింబుతో కూడా మాట్లాడామని,సమస్య పరిష్కారానికి తగిన సహాయం చేస్తామని చెప్పామన్నారు.
 
 అందుకు ఆయన సరిగా స్పందించలేదని తెలిపారు. అలాంటప్పు డు తామేమి చేయగలమని అని అన్నారు. కాగా సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తున్న నటి రాధికా శరత్‌కుమార్‌ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయనున్నట్లు దానికి ఆమె వివరణ ఇచ్చే తీరాలని సంఘం అధ్యక్షుడు నాజర్ అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం అందులోని సభ్యులందరికీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.బీప్ సాంగ్ వ్యవహారం కారణంగా శింబును సంఘం నుంచి తొలగించమని నాజర్ స్పష్టం చేశారు.
 
 8జీ చట్టం అమలు
 అదే విధంగా సంఘాభివృద్ధికి విరాళాలు సేకరిస్తామని, దాతలు టాక్స్ మినహాయింపు,అదే విధంగా డిపాజిట్ల విషయంలో 8జీ చట్టాన్ని తీసుకొస్తామని సంఘం కార్యదర్శి విశాల్ వెల్లడించారు. ఈ విషయమై బ్యాంక్‌లో వినతిపత్రాన్ని అప్లై చేస్తామని తెలిపారు. ఇకపోతే తమిళనాడులో వరద భాదితులను ఆదుకునే విధంగా సేకరించిన విరాళాలు మొత్తం ఒక కోటీ మూడు లక్షల రూపాయల్ని ముఖ్యమంతి సహాయనిధికి అందించినట్లు తెలిపారు.           

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు