గజ తుపాను బాధితులకు ఇల్లు కట్టించిన లారెన్స్‌

15 May, 2019 10:13 IST|Sakshi
బాధితులకు ఇంటి తాళాలు అందజేస్తున్న లారెన్స్‌

పెరంబూరు: గజ తుపాన్‌ బాధితులు 18 మందికి నటుడు, నృత్యదర్శకుడు రాఘవలారెన్స్‌ ఇల్లు కట్టించి ఇచ్చారు. గత ఏడాది గజ తుపాన్‌ తమిళనాడులో బీభత్సానికి గురి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగపట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో గజ తుపానుకు పులువురు నిరాశ్రులయ్యారు. దీంతో ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సినీ ప్రముఖులు ఆ ప్రాంత ప్రజలను కలిసి పరామర్శించడంతో పాటు తగిన సాయం అందించారు. అదే విధంగా నటుడు రాఘవలారెన్స్‌ తుపాన్‌ బాధిత ప్రాంతాలను సందర్శించి ఇల్లు కోల్పోయిన వారిలో కొందరికి ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు.

అన్నట్లుగానే ఆయన నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువలై సమీపంలోని కచ్చనగరం సెరనల్లూర్‌ గ్రామంలోని 18 మంది కుటుంబాలకు రూ.10 లక్షల ఖర్చుతో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం లారెన్స్‌ ఆ ప్రాంతానికి వెళ్లి ఆ 18 కుటుంబాలకు ఇళ్లను స్వాధీనం చేసి గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా తాయ్‌ అనే సేవా సంస్థను ప్రారంభించిన లారెన్స్‌ ఆ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ తాయ్‌ సంస్థ ద్వారా పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులకు తగిన సాయం అందించడంతోపాటు పేద విద్యార్థులకు విద్యాదానం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకోసం తన ప్రతి చిత్రం విడుదల అనంతరం 15 రోజుల పాటు పిల్లలకు విద్యాదానం, వృద్ధులకు చేయూతకు కేటాయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు