కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రాహుల్ సూచన

8 Oct, 2013 02:11 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీన్ని ఢిల్లీ శాసనసభ ఎన్నికలతోనే ప్రారంభించాలంటూ ఇటీవల జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  (డీపీసీసీ) సమావేశాల్లో ఆయన కాస్త గట్టిగానే చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో ఈ నియమాన్ని తప్పక పాటించాలంటూ డీపీసీసీ అధ్యక్షుడు జేపీ.అగర్వాల్, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌లకు సూచించారు. పార్టీ ఉపాధ్యక్షుడి మాట పార్టీ అగ్రనాయకులను కలవరానికి గురిచేస్తోంది. దీంతో వారు అధినాయకుడి మాటలకు కొత్త అర్థాన్ని వెతికేపనిలో పడ్డారు. 
 
 ఇన్నేళ్లుగా ఉన్న పదవులు ‘చేయి’దాటిపోకుండా తమ బంధు గణానికి కట్టబెట్టేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.  పార్టీ తరఫున విధానసభ టికెట్  పొందేందుకు దరఖాస్తు గడువు ఆదివారం సాయంత్రం ముగిసింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు మొత్తం 70 శాసనసభ స్థానాలకు 1,600 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఈ సంఖ్య రెండువేలుగా నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం అన్ని స్థానాలకు పదుల సంఖ్యలో అభ్యర్థులు టికెట్లకోసం పోటీపడుతుండగా, ఉత్తమ్‌నగర్ స్థానానికి ముఖ్యమంత్రి పార్లమెంటరీ కార్యదర్శి ముఖేశ్‌శర్మ ఒక్కరే దరఖాస్తు చేశారు.
 
 ఎవరికొచ్చినా సరే 
 పార్టీ వరుసగా మూడు పర్యాయాలు విధానసభ ఎన్నికల్లో గెలుపొందడంతో స్థానికంగా ‘పట్టు’సాధించిన సీనియర్ నాయకులు ఇప్పుడు ఆ స్థానాలను భార్య, కొడుకు, కూతురు, సమీప బంధువులు... ఇలా ఎవరికో ఒకరికి కట్టబెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా టికెట్ల కోసం తమతోపాటు కుటుంబ సభ్యులతోనూ దరఖాస్తు చేయించారు. ఆదివారం అందిన దరఖాస్తుల్లో ఒకే స్థానానికి తండ్రీ కూతుళ్లు, తండ్రీ కొడుకులు, భార్యభర్త దరఖాస్తు చేసుకోవడం దీనినే సూచిస్తోంది.
 
 వీరిలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే మంగతరామ్‌సింగల్ తన కుమారుడు అజయ్‌సింగల్  దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా మదీపూర్ సీటు కోసం ఎమ్మెల్యే మాలారాంగంగ్‌వల్ తన కొడుకుతోనూ దరఖాస్తు చేయించారు. గత శాసనసభ ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో(46ఓట్లతో) రాజోరి గార్డెన్ నియోజకవర్గం నుంచి గెలుపొంది రికార్డు సృష్టించిన దయానంద్ చందీలా తన భార్య ధనవతిలాల్‌తో కలసి దరఖాస్తు చేశారు. కొడుకుకి టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో ఉన్నవారి జాబితాలో ఎంపీ మహాబల్‌మిశ్రా ఒకరు. తన కుమారుడు వినయ్‌మిశ్రాకి టికెట్ ఇప్పించేందుకు ఆయన ముమ్మరంగా యత్నిస్తున్నారు.
 
 సెలబ్రిటీల కుటుంబసభ్యులు సైతం 
 సెలబ్రిటీల కుటుంబ సభ్యులు సైతం టికెట్ల వేటలో ఉన్నారు. ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి, దక్షిణపురి ఎక్స్‌టెన్షన్ కౌన్సిలర్ అంజూలతా మెహర్వాల్ నజఫ్‌గఢ్ టికెట్‌కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. తిలక్‌నగర్ సీటుకు తీవ్రస్థాయిలో పోటీ ఉంది. ఇక్కడి నుంచి పంజాబీ పాప్ సింగర్ దలే ర్ మెహందీ పోటీకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
 వచ్చే నెలలో జాబితా 
 శాసనసభ ఎన్నికల్లో  పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వచ్చే నెలలో వెలువడే అవకాశముంది. డీపీసీసీ ఎన్నికల కమిటీ  ఈ దరఖాస్తులను ఈ నెల 8, 9 తేదీలలో పరిశీలించి కేంద్ర మంత్రి నారాయణ్‌సామి నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీకి పంపుతుంది. ముఖ్యమంత్రి  కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా