రైల్వే సమస్యలు పరిష్కరించండి

26 May, 2015 03:35 IST|Sakshi

 నగరి నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విజ్ఞప్తి చేశారు. దక్షిణ రైల్వే జీఎం అశోక్ కే అగర్వాల్, రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఎస్ అనంతరామన్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు.
 
 కొరుక్కుపేట:చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఏకాంబర కుప్పుం, నగరి, పుత్తూరు తదితర రైల్వే స్టేషన్లు దక్షిణ రైల్వే పరిధిలోకి వస్తాయన్న విషయం తెలిసిందే. ఈ స్టేషన్ల అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో తన నియోజకవర్గం పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దక్షిణ రైల్వే అధికారులకు ఏకరువు పెట్టేపనిలో నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నిమగ్నమయ్యారు. సోమవారం చెన్నైలోని దక్షిణ రైల్వే అధికారులను కలుసుకుని సమస్యలను వారి దృష్టికి తెచ్చారు.
 
 వినతి : తిరుపతి ఎంపీ వరప్రసాద్‌తో కలసి చెన్నైలో దక్షిణ రైల్వే జీఎం కార్యాలయానికి రోజా వచ్చారు. నగరి, పుత్తూరు, పూడి, వేపగుంట, ఏకాంబరకుప్పం తదితర రైల్వే స్టేషన్లలోని పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులను ఫొటో జిరాక్స్ కాఫీల  రూపంలో జీఎం అశోక్ కేఅగర్వాల్ , రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ ఎస్ అనంతరామన్‌కు వేర్వేరుగా అందజేశారు. ధర్మరాజ పురం వద్ద రైల్వే సబ్‌వే నిర్మాణానికి చర్య లు తీసుకోవాలని కోరారు.
 
 స్పందన: అధికారుల్ని కలిసి తమ సమస్యలపై స్పందించాలని విన్నవించినానంతరం మీడియా తో రోజా మాట్లాడారు. నగరి నియోజకవర్గం పరిధిలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరచడంపై అధికారులు చొరవ చూపించాలని విన్నవించా రు. కొన్ని  సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు. ఏకాంబర కుప్పం రైల్వే సబ్ వేకు సుమారు రూ.మూడు కోట్ల వరకు కేటాయింపులు జరిగినట్టు అధికారులు పేర్కొన్నారన్నారు. పూడి రైల్వే గేటు కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నదని, అక్కడ వంతెన నిర్మించాలని విన్నవించినట్టు చెప్పారు.
 
 తిరుపతి - చెన్నై డీజీ రైలు: తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ, తిరుపతి నుంచి పుణ్యక్షే త్రాల మీదుగా షిర్డీకి రైలు నడపాలని గతంలో కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశామని పేర్కొంటూ, మరికొద్ది రోజుల్లో ఇది కార్యరూపం దాల్చబోతోందన్నారు. కేంద్రం పచ్చ జెండా ఊపడంతో త్వరలో ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. నాయుడుపేట, గూడూరు, సూళూరుపేట తదితర ైరె ల్వే స్టేషన్లలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. అధికారులతో సాగిన భేటీ మేరకు తిరుపతి - చెన్నై మధ్య డీజిల్ అండ్ ఎలక్ట్రికల్ మల్టీబుల్ యూనిట్ ఏసీ రైలు సేవలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ఉండడం వెలుగులోకి వచ్చిందన్నారు. మరో రెండు నెలల్లో రైల్వే మంత్రి చేతుల మీదుగా ఈ రైలు సేవలకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారని పేర్కొన్నారు. రోజా వెంట నగరి మునిసిపాలిటీ చైర్ పర్సన్ శాంతి, మాజీ చైర్మన్ కుమార్, వడమాలపేట జెడ్‌పీటీసీ సురేష్‌రాజు, ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, పుత్తూరు వైఎస్సార్ సీపీ నాయకులు డీఎన్ ఏలుమలై, రవి శంకర్ రాజు, కిరణ్, మహేష్, నగరి మునిసిపాలిటీ కౌన్సిలర్లు బాల, బాలయ్య మురుగన్, రాజలింగం, ఆనందన్, బీఆర్‌వీ అయ్యప్పన్, మోహన్ తదితరులు ఉన్నారు.
 
 విస్తృతం చేయండి:  చెన్నైకు వచ్చిన ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే రోజాలను వైఎస్‌ఆర్ సేవాదళ్ నాయకులు కలుసుకున్నారు. అధికార ప్రతినిధి సైకం  రామకృష్ణారెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఆబోతుల శ్రీకాంత్, పవన్, సభ్యుడు సురవరపు కృష్ణారెడ్డి, మహిళా న్యాయవాది కమలాపురం లక్షీశ్రీదేవిరెడ్డి తదితరులు కలుసుకుని వారికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. చెన్నైలో సేవాదళ్ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేయాలని, అవసరం అయితే, తాము సైతం పాలు పంచుకుంటామని ఈసందర్భంగా తమతో వరప్రసాద్, రోజాలు పేర్కొన్నారని సైకం రామకృష్ణారెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు