సమ్మె చేద్దాం!

25 Dec, 2013 00:37 IST|Sakshi
సాక్షి, చెన్నై:రైల్వే కార్మికులు సమ్మెకు జై కొట్టారు. 86.8 శాతం మంది సమ్మెకు ఆమోదం తెలియజేశారు. బ్యాలెట్ ఓటింగ్‌తో సమ్మె నిర్ణయానికి విజయం చేకూర్చారు. ఏఐఆర్‌ఎఫ్ సభల్లో చర్చ అనంతరం రైల్వే శాఖకు సమ్మె నోటీసు జారీ చేయనున్నట్లు ఎస్‌ఆర్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి ఎన్.కన్నయ్య ప్రకటించారు.  తమ డిమాండ్ల సాధన కోసం రైల్వే కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఆందోళనతో కేంద్రం మెట్టు దిగి వచ్చింది. 38 డిమాండ్లలో రెండింటినీ మాత్రమే అంగీకరించింది. మిగిలిన 36 డిమాండ్లను కేంద్రం పెడచెవిన పెట్టింది. ఇందులో వీఆర్‌ఎస్ తీసుకునే సిబ్బంది వారసులకు విద్యార్హత ఆధారంగా ఉద్యోగ కల్పన, పెన్షన్ విధానంలో ఎన్‌పీఎస్‌ను రద్దు చేసి జీపీఎస్‌ను అమలు చేయాలి, ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీలో రైల్వే ఉద్యోగులకు 20 శాతం సీట్లు కేటాయించాలి, రైల్వేలో ఖాళీలన్నింటనీ భర్తీ చేయాలి,
 
సీసీఎల్‌ను ఎఫ్‌సీఎల్‌గా మార్చాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల సాధనే లక్ష్యంగా సమ్మె సైరన్ మొగించేందుకు రైల్వే కార్మికులు నిర్ణయించారు.ఓటింగ్ : ఇటీవల ఢిల్లీలో జరిగిన అఖిల భారత రైల్వే కార్మికుల సమాఖ్య మహానాడులో చేసిన తీర్మానం మేరకు సమ్మెకు వెళ్లే ముందు కార్మికుల అభిప్రాయం తెలుసుకునేందుకు నిర్ణయించారు. ఏఐఆర్‌ఎఫ్ పిలుపు మేరకు దక్షిణ రైల్వే పరిధిలో ఓటింగ్‌కు ఎస్‌ఆర్‌ఎంయూ చర్యలు తీసుకుంది. ఈనెల 20,21 తేదీల్లో దక్షిణ రైల్వే పరిధిలోని వెయ్యి చోట్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. చెన్నై, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, చెంగల్పట్టు , దిండివనం, పెరంబూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ఓటింగ్‌లో పెద్ద సంఖ్యలో కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
 
85 శాతం సమ్మెకు సిద్ధం : దక్షిణ రైల్వే పరిధిలో ఉపయోగించిన బ్యాలెట్ బాక్సుల్ని చెన్నైకు తెప్పించి ఆది, సోమ వారాల్లో ఓట్ల లెక్కింపు చేశారు. ఇందులో మెజారిటీ శాతం మంది సమ్మెకు జై కొట్టారు. మంగళవారం ఫలితాల్ని ఎస్‌ఆర్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి కన్నయ్య మీడియాకు విడుదల చేశారు. దక్షిణ రైల్వే పరిధిలో 89,100 మంది కార్మికులు ఉండగా, 82,147 మంది తమ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 542 ఓట్లు తిరస్కరణకు గురి అయ్యాయి. 81,605 ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. 91.6 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఫలితాల్లో 77,361 మంది సమ్మెకు జై కొట్టగా, 4244 మంది సమ్మె వద్దు అని ఓటు వేశారు. 86.8 శాతం మంది సమ్మెకు అనుకూలంగా ఓటింగ్ వేయడంతో సైరన్ మొగించేందుకు ఎస్‌ఆర్‌ఎంయూ సన్నద్ధం అవుతోంది. కార్మిక లోకం నిర్ణయాన్ని అఖిల భారత సమాఖ్యకు పంపుతున్నామని కన్నయ్య పేర్కొన్నారు. ఆ సమాఖ్య మహా సభ జనవరిలో జరగనున్నదని, ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు సమ్మె నోటీసునురైల్వే శాఖకు జారీ చేస్తామని పేర్కొన్నారు.  
 
మరిన్ని వార్తలు