రాజ్‌కీయం?!

8 Mar, 2014 22:57 IST|Sakshi
రాజ్‌కీయం?!

 ఎమ్మెన్నెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో తేలనున్న అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వైఖరి
 ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఏం చేయనున్నారు..? బీజేపీ అగ్రనేతల ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా? అభ్యర్థులను ప్రకటించకుండా పరోక్షంగా ‘మహా’ కూటమికి సహకరించేందుకు సిద్ధమయ్యారా? లేకపోతే అభ్యర్థులను బరిలోకి దింపుతానని ప్రకటిస్తారా? అసలు రాజ్ నిర్ణయం ఎలా ఉండోబోతోంది? అసలు ఏం చేయబోతున్నారో? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారంనాడు జరగనున్న ఎమ్మెన్నెస్ పార్టీ ఎనిమిదో వార్షికోత్సవంలో రాజ్‌ఠాక్రే దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ ఉపాధ్యక్షుడు వాగీశ్ సరస్వత్ శనివారం మీడియాకు తెలిపారు.
 
  ‘మాది రాజకీయ పార్టీ. అన్ని ఎన్నికలు మాకు ప్రధానమే. తమ పార్టీ కొంతమందికి మిత్ర మండల్ కాద’న్నారు. ఇప్పటికే రాజ్‌ఠాక్రేతో భేటీ గురించి బీజేపీ నాయకులు మీడియాకు వివరించారని తెలిపారు. అయితే ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధతిపై ఇప్పటికే రాజ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఆఫీస్ బేరర్లతో చర్చించారన్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.  కాగా, కొన్ని రోజుల క్రితం బీజేపీ నేతలు నితిన్ గడ్కారీ, వినోద్ తావ్డే, ముంబై బీజేపీ అధ్యక్షుడు అశీష్ షెలార్‌లు రాజ్‌ఠాక్రేను కలిసి లోక్‌సభకు అభ్యర్థులను బరిలోకి దింపవద్దని కోరారు. గతంలో జరిగిన అనుభవం దృష్ట్యా ఈసారి కాంగ్రెస్ కూటమిని దెబ్బకొట్టాలంటే పోటీకి దింపకపోవడమే మంచిదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అవసరమనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరిస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఈ నెల 20న జరగనున్న విధాన మండలి ఎన్నికల్లో బీజేపీకి 12 మంది ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు మద్దతును కూడా ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఇదిలావుండగా 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ 12 లోక్‌సభ స్థానాలకు పోటీచేసింది. ముంబైలోని అన్ని స్థానాలతో పాటు ఠాణే, నాసిక్, పుణేలో బరిలోకి దిగిన ఎమెన్నెస్ అభ్యర్థులకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లను గెలుచుకుంది. మరాఠీ ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి లబ్ధి చేకూరేలా వ్యవహరించిందని అప్పట్లో కాషాయకూటమి ఆరోపించిన సంగతి తెలిసిందే.
 
 ఏర్పాట్లు పూర్తి...
 ముంబైలో జరిగే పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవానికి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు