ఒప్పందం అమలు ఎన్నడో!

7 Sep, 2016 13:44 IST|Sakshi
 భవనాల అప్పగింతపై రెండు శాఖల మధ్య వివాదం
 హైకోర్టు రిజిస్ట్రార్ ఆరా..
 
రాజంపేట: రాజంపేట కోర్టు క్లాంపెక్స్ ఒప్పందం పంచాయతీ ఎంతకీ తెగడంలేదు. ఈ విషయంలో రెవెన్యూ, న్యాయశాఖల మధ్య నెలకొన్న పరిస్ధితులు కొలిక్కిరాలేదు. మూడేళ్ల కిందట కలెక్టరు, అప్పటి జిల్లా జడ్జి రాజంపేట కోర్టు ఆవరణ పరిశీలించి, ప్రత్యేకంగా కోర్టు క్లాంపెక్స్‌ను ఏర్పాటుచేసుకొనే దిశగా చర్చించారు. గత కలెక్టరు కేవీ రమణ అఫిషియల్‌క్లబ్‌ను కోర్టుకు ఇచ్చేవిధంగా ముందుకొస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ క్లబ్ భవనాలు కోర్టుకు సరిపడవని న్యాయవాదులు, క్లబ్ ప్రభుత్వ ఆస్తికాదని తమదేనని సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. రెవెన్యూశాఖపై హైకోర్టులో రిట్ దాఖలు చేసేందుకు సన్నద్ధులయ్యారు.
 
రాజంపేట సబ్‌కలెక్టరు (ఆర్డీవో) కార్యాల యంలో న్యాయశాఖకు సంబంధించిన భవనాలను రెవెన్యూశాఖకు అప్పగించడం, ప్ర స్తుతం కోర్టు ఆవరణలో ఉన్న రెవెన్యూ భవనాలను న్యాయశాఖకు అప్పగించే విధంగా ఒప్పందం కుదిరింది. ఆ విధంగా రాజంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉన్న న్యాయశాఖ భవనాలను ఆ పరిధిలోనే ఉంచేశారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న తహశీల్దారు కార్యాలయం, రెవెన్యూ భవనాలను న్యాయశాఖకు అప్పగించలేదు. ఇదే విషయంపై హైకోర్టు రెవెన్యూ శాఖను ప్రశ్నించినట్లు తెలిసింది. హైకోర్టు రిజిస్ట్రారు ఈ వ్యవహారంపై ఆరా తీశారు.  ఈ విషయాన్ని రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు ‘సాక్షి’కి ధృవీకరించారు. తాము గత కొన్నాళ్లుగా కోర్టు క్లాంపెక్స్ ఒప్పందం అమలు హైకోర్టు జడ్జి నుంచి జిల్లా జడ్జిల వరకు విన్నవిస్తూవస్తూనే ఉన్నామని స్పష్టంచేశారు. రెవెన్యూశాఖ తమ భవనాలు అప్పగించలేదని, ఒప్పందం ప్రకారం ఆర్డీవోకార్యాలయంలోని న్యాయశాఖ భవనాలు ఇచ్చేసినట్లు వెల్లడించారు. 
 
ఇరుకుగదితో ఇక్కట్లు
రాజంపేటలో 1906కు ముందే సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఉన్నట్లుగా గ్రామపటం చూపిస్తోంది. ప్రభుత్వస్ధలం కాబట్టే 1911లో వచ్చిన ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రత్యేకంగా చూపలేదు. విలేజ్ కీ మ్యాప్ ప్రకారం పోలీసుస్టేషన్, తహశీల్దారు ఆఫీసు, సబ్‌ట్రెజరీ, సబ్‌జైలు కార్యాలయాలు ఒకవైపు, మరోవైపు కోర్టు ఉంది. 1983లో ఎన్‌టీఆర్ బర్తరఫ్ సందర్భంగా జరిగిన అల్లర్లలో తహశీల్దారు, కోర్టుభవనం దగ్ధమయ్యాయి. 2000లో ప్రస్తుతం ఉన్న నూతనభవనం నిర్మించారు. 2007లో జిల్లా అదనపు కోర్టు తాత్కాలిక పాస్ట్‌ట్రాక్  కోర్టుగా మంజూరు చేశారు. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదనక ఏడీజే గా అవతరించింది. ఉన్నతస్ధాయి న్యాయస్ధానం స్థానిక జూనియర్ సివిల్ జడ్జికోర్టులోని  ఇరుకైన గదిలో నడుస్తోంది. 
 
కలెక్టరు కోనశశిధర్ హయాంలో..
గతంలో జిల్లా కలెక్టరుగా పనిచేసిన కోన శశిధర్, అప్పటి జిల్లా న్యాయమూర్తి కలిసి తహశీల్దారు కార్యాలయ భవనాన్ని కోర్టు సముదాయాలకు ఇచ్చేట్లుగా, దీనికి బదులుగా సీనియర్ సివిల్ జడ్జి బంగాళాలోకి తహశీల్దారు కార్యాలయాన్ని బదలాయింపుచేసే విధంగా ఒప్పుకొని ఉత్తర్వులు ఇచ్చారు. రాయచోటి, కోడూరు వంటి ప్రాంతాల్లో కోర్టులకు నూతన భవనాలు పూర్తయినా రాజంపేటలో మాత్రం ఇరుకుగదుల్లో నిర్వహించుకోవాల్సిన దుస్ధితి నెలకొంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం న్యాయవ్యవస్థకు ఇబ్బందులు కలుగజేయడమే కాక  కక్షిదారులకు అసౌకర్యంగా ఉంది. తక్షణం అధికారులు, పాలకులు, న్యాయవాదసంఘాలు స్పందించి సమస్యను పరిష్కరించాలని న్యాయవాదులు, కక్షిదారులు కోరుతున్నారు.
 
మరిన్ని వార్తలు