కమల్‌పై రజనీ సంచలన వ్యాఖ్యలు

6 Apr, 2017 18:22 IST|Sakshi
కమల్‌పై రజనీ సంచలన వ్యాఖ్యలు

చంద్రహాసన్‌ సంస్మరణ సభలో రజనీకాంత్‌
చెన్నై: కమల్‌హాసన్‌ గురించి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్‌కు కోపం చాలా ఎక్కువని అన్నారు. కమల్‌హాసన్‌ సోదరుడు చంద్రహాసన్‌ వర‍్థంతి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కమల్‌ లాంటి కోపిష్టి వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. ఆయనకు ఉన్న కోపంలో పదో వంతు మాత్రమే జనానికి తెలుసునని, తనకు మాత్రం వందశాతం తెలుసుకునని..అందుకే ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. అన్న చారు హాసన్‌కు మాత్రమే ఆయన కోపాన్ని ఆపగల శక్తి ఉందని చెప్పారు.

అయితే, చంద్రహాసన్‌ మాత్రం కమల్‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్‌లో ఉంచుతుండేవారని తెలిపారు. చంద్రహాసన్‌ను కేవలం రెండుసార్లు మాత్రమే కలుసుకున్నప్పటికీ..కమల్‌ శక్తి, యుక్తి ఆయనేనని గుర్తించానని చెప్పారు. ఈ రోజుల్లో మిగతా సినీ నటుల మాదిరిగా కమల్‌హాసన్‌కు డబ్బు కూడబెట్టుకునే గుణం లేకపోవటం బాధాకరమన్నారు. చంద్రహాసన్‌ ప్రభావం వల్లనే ఆయనకు ఇది అలవాటైందని చెప్పారు. అయితే, చంద్రహాసన్‌ లేని ప్రస్తుత పరిస్థితుల్లో కమల్‌ కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడుకుంటారని భావిస్తున్నానన్నారు.

సినీ ప్రముఖులైన కె.బాలచందర్‌, అనంతు, చంద్రహాసన్‌, చారుహాసన్‌ కమల్‌ జీవితంలో ముఖ్యమైన వారని వివరించారు. వీరిలో ముగ్గురు కన్నుమూసినా వారి దీవెనలు మాత్రం కమల్‌కు ఎప్పుడూ ఉంటాయన్నారు. కమల్‌కు తాము అండగా నిలుస్తామని ధైర్యం చెప్పారు. చంద్రహాసన్‌ నిజాయతీపరుడైన పౌరుడని కమల్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన కారణంగానే తాను సగర్వంగా పనిచేయగలుగుతున్నానని చెప్పారు. అంత మంచి మనిషిని సోదరుడిగా పొందడం తన అదృష్టమన్నారు.

రజనీకాంత్‌ మాటల్ని కమల్‌ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఎంతగానో ప్రభావితం చేసిన సోదరులు తనకు లేనప్పటికీ.. సినిమాలతో డబ్బు సంపాదించటం తెలిసిన సోదరులు చాలా మంది ప్రస్తుతం తనకున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి సోదరుల్లో రజనీకాంత్‌ ఒకరని చమత్కరించారు. కమల్‌ సోదరుడు, సినీ నిర్మాత అయిన చంద్రహాసన్‌(82) ఇటీవలే లండన్‌లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ వ‍్యవహారాలను చూసుకునేవారు.
 

మరిన్ని వార్తలు