తలైవాను ఎవరూ ఆపలేరు!

28 May, 2017 02:32 IST|Sakshi
తలైవాను ఎవరూ ఆపలేరు!

జూలై చివర్లో సొంత పార్టీ ప్రకటన
  అవినీతి, లంచం రూపుమాపడమే లక్ష్యం
రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణన్‌ స్పష్టీకరణ


సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్‌ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన సోదరుడు సత్యనారాయణన్‌ బెంగళూరులో చేసిన ప్రకటన కలకలం రేపింది. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, ఆపలేరని సైతం ఆయన సవాల్‌ చేశారు. రజనీ రాజకీయాలపై ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు రెండు రోజుల క్రితం ప్రత్యేకంగా అనేక విషయాలు వివరించినట్లు విశ్వసనీయంగా తెలుస్తుండగా, ఆ వివరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సత్యనారాయణన్‌ శనివారం ఒక తమిళ్‌ చానల్‌లో ఖండించారు.రజనీ రాజకీయాల అంశం రెండు దశాబ్దాలుగా నానుతోంది. సుమారు పాతికేళ్ల క్రితం ఒక పార్టీ ‘మాట సాయం’ చేసిన రజనీకాంత్‌ ఆ తరువాత రాజకీయాలకు దూరంగా మెలగడం ప్రారంభించారు.

ఆ తరువాత 2008 నవంబర్‌ 3వ తేదీన అభిమానులతో సమావేశమై చర్చకు తెరదీశారు. ‘యందిరన్‌’ (రోబో) చిత్రం విడుదల తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాజకీయ ప్రవేశంపై అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులుగా హామీ ఇచ్చారు. అయినా ఆ తరువాత రజనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. రాజకీయాల్లో రావాలని రాసిపెట్టి ఉంటే మిగతా వస్తాను అని ‘లింగా’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో రజనీ రాజకీయాల్లో రావడం ఖాయమని ప్రచారం జరిగింది.

 అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, వృద్ధాప్య అనారోగ్య కారణాలతో డీఎంకే అధ్యక్షులు కరుణానిధి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా మెలగడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. రాజకీయాల్లోకి రావాలని అభిమానుల నుంచి రజనీపై ఒత్తిడి పెరిగింది. రాజకీయ ప్రవేశంపై రజనీ సైతం ఆలోచనలో పడి ఐదురోజులపాటు 15 జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమై అభిప్రాయసేకరణ చేశారు.

రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ చెడిపోయింది....యుద్ధం వస్తుంది..అపుడు రండి అంటూ అభిమానులకు రజనీకాంత్‌ పిలుపునిచ్చి రాజకీయ అరంగేట్రం ఖాయమనే సూచనలు చేశారు. 2019లో పార్లమెంటు ఎన్నికల్లో తన బలాన్ని పరీక్షించుకుని 2021లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి అధికారంలోకి రావాలని రజనీ వ్యూహంగా ఉంది. రజనీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రజనీ రాజకీయాల్లోకి రావడంపై  అనుకూల, వ్యతిరేక ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో..., రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం ఖాయమని స్వయానా సోదరుడు (అన్న) సత్యనారాయణన్‌ శనివారం తొలిసారిగా అధికారికంగా ప్రకటించారు.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుతుండగా అభిమానుల అభిప్రాయాలు సైతం తీసుకునేందు తొలి దశ సమావేశం పూర్తయిందని అన్నారు. వచ్చేనెలలో అభిమానులతో రెండోదశ సమావేశాలు పూర్తి చేసి జూలై చివర్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. రజనీ రాజకీయ ప్రవేశాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు,  తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందని అన్నారు. అవినీతి, లంచగొండితననాన్ని రూపుమాపడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి, వాటిలో ఏ మేరకు లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన ప్రశ్నించారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే అవినీతిని రూపుమాపుతారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.రజనీకాంత్‌ను తమ పార్టీల్లోకి లాక్కోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు, అయితే ఆయన ఏపార్టీలోకి వెళ్లరు, స్వంతపార్టీ పెడతారని సత్యనారాయణన్‌ తెలిపారు. పార్టీ పేరు, చిహ్నంలపై పరిశీలన జరుగుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా, రజనీ రాజకీయాలపై తన పేరుతో వెల్లడైన వివరాలను సత్యనారాయణన్‌ శనివారం సాయంత్రం ఒక తమిళ న్యూస్‌చానల్‌ వద్ద ఖండించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు