అందుకు మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు: రజనీ

15 Mar, 2020 09:52 IST|Sakshi

సాక్షి, పెరంబూరు: నటుడు రజనీకాంత్‌ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈయన రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు పార్టీని పెడతారా, పార్టీ జెండా, అజెండాలను ప్రకటిస్తారాఅన్న ఆసక్తి రాజకీయ నాయకులతో పాటు, అభిమానుల్లోనూ నెలకొంది. మరో పక్క శాసనసభ ఎన్నికలకు మరో ఏడాదే గడువు ఉండడంతో రజనీకాంత్‌ వైఖరి ఏమిటన్న  ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌ గత గురువారం (12వ తేధీ) చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తమిళనాడులో మార్పు రావాలని, ఇక్కడ అధికార శూన్యత ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా రాజకీయ మార్పు అన్నది ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడూ రాదని అన్నారు. చదవండి: 'నా పార్టీ జెండా ఇంద్రధనుస్సు గుర్తు జామకాయ'

మంచి నాయకులను తయారు చేసేవాడే ఒక మంచి నాయకుడని అన్నారు. యువకుడు, విద్యావంతుడు, సేవాభావం, ప్రేమ, పాశం వంటి లక్షణాలు కలిగిన వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కాగా రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయనాయకులు, విమర్శకులు, సినీ ప్రముఖులు, అభిమానులు వారి వారి భావాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలన్న తన వ్యాఖ్యలు ప్రజల్లోకి బాగా చేరాయన్న ఉత్సాహంలో ఉన్నా రజనీకాంత్‌ శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రాజకీయ మార్పు, పరిపాలనలో మార్చు, ఇప్పుడు జరగకుంటే ఎప్పటికీ జరగదన్న తన వ్యాఖ్యలను పామరులకు సైతం చేరేలా చేసిన మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు రజనీకాంత్‌ పేర్కొన్నారు. 

రాజకీయాల్లో లేనివారి గురించి ఏం మాట్లాడతాం 
కాగా రాజకీయాల్లోకిరాని రజనీకాంత్‌ గురించి ఏం మాట్లాడతామని రాష్ట్రమంత్రి జయకుమార్‌ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. అప్పుడు నటుడు రజనీకాంత్‌ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల గురించి స్పందించాల్సిందిగా అడిగిన ప్రశ్నకు రాజకీయాల్లో లేని రజనీకాంత్‌ గురించి ఏం మాట్లాడతాం అని మంత్రి అన్నారు. అంతే కాకుండా ఆయన అన్నాడీఎంకే గురించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. రజనీకాంత్, తన లక్ష్యం గురించి చెప్పుకోవడంలో తప్పులేదని అన్నారు.  

మరిన్ని వార్తలు