సూపర్ స్టార్‌పై సుప్రీంకోర్టుకు..

6 Feb, 2015 08:14 IST|Sakshi
సూపర్ స్టార్‌పై సుప్రీంకోర్టుకు..

తమిళసినిమా: సూపర్‌స్టార్‌పై సుప్రీం కోర్టులో వ్యాజ్యానికి రెడీ అవుతున్నారు మై హూన్ రజనీకాంత్ నిర్మాత సూరజ్. తమిళంలో ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలుచిత్రాలు చేసిన ఆదిత్యామీనన్ హీరోగా నటించిన హిందీ చిత్రం మై హూన్ రజనీకాంత్. పైసల్ సైఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళనాట విడుదల చేయటాన్ని వ్యతిరేకిస్తూ నటుడు రజనీకాంత్ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలుచేశారు. ఈ చిత్రం తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉందని చిత్ర టైటిల్‌తోపాటు సన్నివేశాలు, ప్రచారం చిత్రం చూస్తుంటే సందేహం కలుగుతోందని పేర్కొన్నారు. కాబట్టి ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించాలని కోరారు.
 
హైకోర్టులో ఈ కేసు విచారణ రజనీకాంత్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో మైహూన్ రజనీకాంత్ చిత్ర నిర్మాత సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆ చిత్ర దర్శకుడు పైసల్ సైఫ్ వెల్లడించారు. ఆయన తెలుపుతూ చిత్ర కథకు తగినట్లుగానే టైటిల్‌ను నిర్ణయించామన్నారు. చిత్ర కథ కూడా హీరో చుట్టూనే తిరుగుతుందని తెలిపారు. ఒక చిత్ర కథకుడిగా, దర్శకుడిగా రజనీకాంత్‌ను అవమానించాలని తాను భావించలేదన్నారు. అందువలన తాను చిత్ర టైటిల్‌ను మార్చాలని భావించినా నిర్మాత పోరాటానికే నిర్ణయం తీసుకున్నారని, దీంతో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధం అవుతున్నారని దర్శకుడు పైసల్ సైఫ్ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు