రజనీపై కేసు నమోదుకు కోర్టు ఆదేశిస్తుందా?

8 Mar, 2020 08:21 IST|Sakshi

సాక్షి, పెరంబూరు: నటుడు రజనీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తుందా? ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతారా? ఇలాంటి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే నటుడు రజనీకాంత్‌ గత జనవరిలో జరిగిన ఒక వేడుకలో మాట్లాడుతూ పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో డ్రావిడ కళగం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పెరియార్‌ సీతారాముల చిత్ర పటాన్ని విసిరేశారని రజనీకాంత్‌ అన్నారు. ఈయన వ్యాఖ్యలు పెద్ద వివాదానికే దారి తీశాయి.

హిందూ సంఘాలు, రజనీకాంత్‌ తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌ చేశారు. అయితే అందుకు రజనీకాంత్‌ నిరాకరించడంతో పాటు ఈ అంశంపై చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. కాగా రజనీకాంత్‌ వ్యాఖ్యలు మతసామరస్యానికి చేటు అని మతాల మధ్య చిచ్చు రగిల్చేవిగా ఉన్నాయంటూ స్థానిక ట్రిప్లికేన్‌కు చెందిన డ్రావిడన్‌ విడుదలై కళగం చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి జనవరి 18వ తేదీన ట్రిప్లికేన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పోలీసులు  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో పిర్యాదు చేశారు. అక్కడ స్పందించకపోవడంతో ఉమాపతి చెన్నై, ఎగ్మూర్‌ నేర విభాగ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చదవండి: పార్టీ ఏర్పాటులో రజనీ మరో అడుగు

కాగా ఈ పిటిషన్‌ శనివారం న్యాయమూర్తి రోశ్విన్‌దురై సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు హాజరై నటుడు రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలదో మతసామరస్యానికి ముప్పు కలిగే ప్రమాదం ఉందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని,  ఆయనపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కాబట్టి రజనీకాంత్‌పై  కేసు నమోదు చేసేలా పోలీస్‌కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.దీంతో రజనీకాంత్‌ వ్మాఖ్యల వల్ల రాష్ట్రంలో గొడవలేమీ జరగలేదుగా అని న్యాయమూర్తి  అడిగారు. అందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పెద్దగా గొడవుల జరగలేదు గానీ, పుదుచ్చేరిలో పెరియార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, ఇలాంటి నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఇటీవల ఢిల్లీలో అల్లర్లు జరిగాయని వివరించారు. దీంతో న్యాయమూర్తి రజనీకాంత్‌పై కేసు నమోదు చేయాలని గానీ, కుదరదని గానీ చెప్పకుండా సోమవారానికి విచారణను వాయిదా వేశారు. దీంతో సోమవారం న్యాయస్థానం  రజనీకాంత్‌పై ఎలాంటి తీర్పును ఇస్తుందన్న ఆసక్తి నెలకొంది. చదవండి: ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్‌

మరిన్ని వార్తలు