ముహూర్తం ఖరారు!

17 Jun, 2017 01:23 IST|Sakshi
ముహూర్తం ఖరారు!

వేడెక్కిస్తున్న రజనీ రాజకీయ ప్రవేశం 
డిసెంబర్‌ 12న అరంగేట్రం
సూపర్‌స్టారే స్వయంగా ప్రకటిస్తారని సన్నిహిత మిత్రుడు వెల్లడి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం ఖాయమని సన్నిహిత మిత్రుడు శుక్రవారం మీడియాకు స్పష్టం చేశారు. ఈ ఏడాది తనపుట్టిన రోజు అయిన డిసెంబర్‌ 12వ తేదీన తలైవా రజనీకాంత్‌ స్వయంగా ప్రకటిస్తారని ఆయన మీడియాతో పేర్కొన్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ప్రజలకు దూరంగా మెలగడంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొంది. తమిళనాడుకు బాసటగా నిలిచే శక్తిమంతమైన నేత కావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితిలో తమిళ రాజకీయాల్లో కాలుమోపాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై మళ్లీ ఒత్తిడి పెరిగింది. సుమారు రెండుదశాబ్దాల క్రితం రాజకీయాల ప్రస్తావన, ఒక పార్టీకి మద్దతుగా రజనీకాంత్‌ మాట్లాడిన తీరు ప్రకంపనలు సృష్టించింది.

ఈ పరిణామాలు రజనీకాంత్‌పై అనుకూలంతోపాటు పెద్ద ఎత్తున ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపాయి. దీంతో ఆయన ఇక రాజకీయాలకు దూరంగా మెలగాలని నిర్ణయించుకుని ఆధ్యాత్మిక బాటపట్టారు. షూటింగ్‌ లేని సమయాల్లో హిమాలయాలకు వెళ్లి గురుదేవులను కలిసేవారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వచ్చినపుడల్లా రజనీ రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికార్లు చేసేవి. అనేక పార్టీలు సైతం రజనీని ఆహ్వానించాయి.

ముఖ్యంగా బీజేపీ అలుపెరుగని ప్రయత్నాలు చేసింది. గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో తమిళనాడుకు వచ్చిన నరేంద్రమోదీ స్వయంగా రజనీకాంత్‌ ఇంటికి వెళ్లారు. అంతే రజనీ బీజేపీలో చేరుతున్నాడనే ప్రచారం జరిగింది. తమది కేవలం స్నేహపూర్వక కలయికని రజనీకాంత్‌ ప్రచారాలకు తెరదించారు. ఇంటి వద్ద అభిమానులను కలవడం మానేశారు. సినిమా, ఆధ్యాత్మిక జీవితంలో పూర్తిగా మునిగి తేలడంతో రజనీ ఇక రాజకీయాల్లోకి రారని అందరూ నిర్ధారించుకున్నారు.

అకస్మాత్తుగా అభిమానులతో సమావేశాలు:
జయలలిత మరణం తరువాత రజనీకాంత్‌ ఆలోచనలో అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకుంది.  చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపానికి తన అభిమానులను పిలిపించుకున్నారు. మూడురోజులపాటు వారితో సమావేశమై ఫొటోలు దిగారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థను చక్కదిద్దాలని తాను అనుకోవడంలో తప్పేముందని అన్నారు. యుద్ధం వచ్చినపుడు పిలుస్తా, వెళ్లిరండి అని అభిమానులను సాగనంపారు.

అంతేకాదు ఇటీవల ముంబయిలో కాలా చిత్రం షూటింగ్‌ ముగించుకుని చెన్నై వచ్చినపుడు రెండు నెలల్లో మరలా అభిమానులను కలుస్తానని ప్రకటించారు. రజనీ ప్రసంగాలను కొన్ని పార్టీలు స్వాగతించగా మరికొన్ని విమర్శించాయి. రజనీకాంత్‌ తమిళుడు కాదని, ఇతరులకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని కొందరు బహిరంగ విమర్శలు చేశారు. అయితే రజనీకాంత్‌ మాత్రం రాజకీయ ప్రవేశంపై ఇంత వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. జూలై లేదా ఆగస్టులో రెండోవిడత అభిమానుల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేశారు.

అయితే రజనీకాంత్‌ తన జన్మదినమైన డిసెంబర్‌ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని తాజా సమాచారం. రజనీకాంత్‌కు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి ఈ విషయాన్ని నిర్ధారించాడు. రాజకీయాల్లోకి రావాలని రజనీ నిర్ణయించుకున్నారని, అభిమానులతో మరోసారి సమావేశమైన తరువాత డిసెంబర్‌ 12వ తేదీన బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన మీడియాకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు