రాజీవ్‌ హత్యకేసులో దారులన్నీ మూతపడ్డట్లే..!

22 Mar, 2020 10:42 IST|Sakshi

సాక్షి, చెన్నై: రాజీవ్‌ హత్య కేసు నిందితుల విడుదలకు దారులన్నీ మూసుకున్న నేపథ్యంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎదురు చూపులకు దారితీశాయి. ఇందుకు తగ్గట్టుగా రాజ్‌భవన్‌ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. రాజీవ్‌ హత్యకేసులో నింధితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్‌ సహా ఏడుగురి ఉరిశిక్ష యావజ్జీవంగా మారిన విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసినా తాము జైలుకే పరిమితం కావడంతో విడుదల చేయాలని కోరుతూ నిందితులు కోర్టుల్ని ఆశ్రయిస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. వీరి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసినా, అది రాజ్‌భవన్‌కే పరిమితమైంది. తమను విడుదలచేసే రీతిలో గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని మళ్లీ కోర్టు తలుపులు తట్టినా ప్రయోజనం శూన్యం. చివరకు బంతి రాజ్‌ భవన్‌ కోర్టులో పడింది.

ఈ వ్యవహారంలో గవర్నర్‌ భన్వారిలాల్‌ పురోహిత్‌ ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంది. అదే సమయంలో శిక్షాకాలం ముగిసినా, జైలులోనే జీవితాలు మగ్గుతున్నాయంటూ నళిని దాఖలు చేసుకున్న పిటిషన్‌ హైకోర్టు న్యాయమూర్తులు సుబ్బయ్య, పొంగియప్పన్‌ బెంచ్‌ ముందుకు గత నెల విచారణకు వచ్చింది. ఈ సమయంలో కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజగోపాల్‌ కోర్టుకు ఇచ్చిన వివరణ సర్వత్రా షాక్‌కు గురిచేసింది. తమిళనాడు ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఎప్పుడో తిరస్కరించినట్టు వివరించారు. ఆ తీర్మానం విలువను ‘సున్న’గా పరిగణించాలని వాదించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ తీర్మానం గురించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు సిఫారసు చేసి ఉన్నట్టుగా పేర్కొనడంతో విచారణను ముగించే విధంగా, రాజీవ్‌ హంతకుల ఆశలు అడియాశలు అయ్యే రీతిలో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక వీరి విడుదలకు అన్నిదారులు మూసుకున్నట్టే అన్నది స్పష్టం కావడంతో తమిళాభిమాన సంఘాలు, ఈలం మద్దతు సంఘాలు, పార్టీలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసే పనిలో పడ్డాయి.
 
మంత్రి వ్యాఖ్యలతో కాస్త ఊరట 
నళిని పిటిషన్‌ తిరస్కరణకు గురికావడంతో ఇతర నింధితులు వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లన్నీ ఒకదాని తర్వాత మరొకటి మున్ముందు రోజుల్లో తిరస్కరించే అవకాశాలు ఎక్కువే అన్న సంకేతాల నేపథ్యంలో న్యాయశాఖామంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యలు ఎక్కడో కాస్త ఊరట కల్గించేలా ఉండడం గమనార్హం. అసెంబ్లీలో కొంగు ఇలంజర్‌ పేరవై ఎమ్మెల్యే తనియరసు సందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం స్పందించారు. ఏడుగుర్ని విడుదల చేయాలన్న తపనతో తామూ ఉన్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం గవర్నర్‌ చేతిలో ఉందని, తాము ఇప్పటికే నిర్ణయం తీసుకునేందుకు తగ్గట్టుగా సిఫారసులు చేసి ఉన్నామని వివరించారు. చదవండి: ఏంటయ్యా ఇంట్లోనే కూర్చోమంటున్నారు!

రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శికి లేఖ కూడా రాసినట్టు పేర్కొన్నారు. ఇందుకు రాజ్‌ భవన్‌ నుంచి గవర్నర్‌ కార్యదర్శి సమాధానం పంపించి ఉన్నారని వివరించారు. రాజీవ్‌ హత్య కేసు, కుట్ర విషయంగా  సీబీఐ, ఐబీలతో పాటుగా పలు విచారణ బృందాలతో పర్యవేక్షణ కమిటీ నియమించి ఉన్నట్టు ప్రకటించారు. ఆ కమిటీ కోర్టుకు ఇచ్చే నివేదిక మేరకు తదుపరి ప్రభుత్వ సిఫారసు మీద నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొని ఉన్నారని మంత్రి ప్రకటించడంతో ఈ నివేదిక ఎలా ఉంటుందో, ఈ దారి రూపంలో నైనా వారి విడుదలకు మార్గం లభించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి.    

మరిన్ని వార్తలు