కోలీవుడ్‌కు రాజ్‌కుమార్ మనవడు

23 Jan, 2015 04:05 IST|Sakshi
కోలీవుడ్‌కు రాజ్‌కుమార్ మనవడు

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవడు విజయరాఘవేంద్ర తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నారు. బాలనటుడిగా పరిచయమైన ఈయన కన్నడంలో పలు చిత్రాలు చేశారు. తాజాగా తమిళం, కన్నడం భాషల్లో నటిస్తున్న చిత్రానికి తమిళంలో అధర్పణం అని కన్నడంలో రణతంత్ర పేరుతో  తెరకెక్కుతోంది. ఇంతకుముందు పూర్తి డిజిటల్ చిత్రంగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సిలంధి చిత్రం ఫేమ్ ఆదిరాం దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. విజయ రాఘవేంద్రకు జంటగా హరిప్రియ నటిస్తున్న ఈ చిత్రాన్ని మనోజ్‌కుమార్ యాదవ్ ప్రొడక్షన్స్ పతాకంపై మహిళా నిర్మాత ప్రియా రమేష్ సమర్పణలో ఎస్.రమేష్ నిర్మిస్తున్నారు.
 
 నటి మేఘనా నాయుడు ఒక స్పెషల్ సాంగ్‌లో నటించిన ఈ చిత్రానికి సిలంధి చిత్రం ఫేమ్ ఎం.కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఆదిరాం ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను తన డిజిటల్ థియేటర్స్ బ్యానర్‌లో నిర్వహించడం విశేషం. చిత్ర కథ గురించి దర్శకుడు తెలుపుతూ ఒక ప్రేమ జంట ఎదుర్కొనే అనూహ్య సంఘటనలు వారిని మరణపు అంచులకు చేరుస్తాయన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఆ జంట బయటపడిందా? లేదా? అన్నదే చిత్ర ప్రధానాంశం అని చెప్పారు. తదుపరి సన్నివేశంలో ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠభరితంగా చిత్రం సాగుతుందని తెలిపారు. చిత్రానికి స్క్రీన్‌ప్లే చాలా బలం అవుతుందని దర్శకుడు వెల్లడించారు.  
 

మరిన్ని వార్తలు