భక్తులకు శ్రీవారిని దూరం చేస్తున్న టీటీడీ బోర్డు

18 Jul, 2018 04:33 IST|Sakshi

     నా ఆరోపణలకు బలం చేకూర్చేలా బోర్డు చేష్టలు

     ఆధ్యాత్మికవాదులకు చోటులేని బోర్డు వల్లనే అరిష్టం

     భగవంతుడిని రక్షించుకునే బాధ్యత భక్తులదే

     టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆవేదన  

సాక్షి ప్రతినిధి, చెన్నై: టీటీడీ పాలకమండలి, ఈవో తదితరుల చేష్టలతో భక్తులకు శ్రీవారు దూరమవుతున్నారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి సాక్షిగా జరుగుతున్న ఈ అన్యాయాలను అరికట్టేదిశగా భక్తులే బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. చెన్నైలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. పరమపవిత్రమైన టీటీడీ బోర్డు ఎలాంటి ఆధ్యాత్మిక భావాలు, దైవభక్తి, హిందూ సంప్రదాయాలు లేని రాజకీయ నేతలతో కళంకితమైపోయిందన్నారు. శ్రీవారి ఆలయ పర్యవేక్షణకు ఆధ్యాత్మికవేత్తలు, ఆగమశాస్త్రాలు, హిందూ సంప్రదాయాల మీద నమ్మకం ఉన్నవారే ఈ ప్రభుత్వానికి దొరకలేదా అని ప్రశ్నించారు. అధికారులు వారు చెప్పినట్లే ఆడటం శోచనీయమన్నారు.

మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనం పూర్తిగా నిలుపుదల చేయాలనే నిర్ణయం వెనుక ఉన్న నిర్ణేత ఎవరని నిలదీశారు. కొద్దిమందికి దర్శనం కల్పిస్తే సరిపోతుందని సీఎం అన్నట్టు సమాచారం. ఆ కొద్దిమంది ఎవరు.. వీవీఐపీలా, అధికార పార్టీ వందిమాగదులా అన్నారు. చేసిన, చేస్తున్న తప్పులను మసిపూసి మారేడుకాయ చేసేందుకు బోర్డు సిద్ధం అవుతోందని, అందులో భాగంగానే మహాసంప్రోక్షణను అడ్డంపెట్టుకుని దర్శనాలు, తిరుమల మార్గాలన్నీ మూసివేత నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితి టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రస్తుత పాలకమండలి నైజంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. çసుమారు 12 ఏళ్ల క్రితం మహాసంప్రోక్షణలో పాల్గొన్న వారెవరూ నేడు లేరు. అనుభవం ఉన్నవారిని వెళ్లగొట్టారు.. ఈ విషయంలో ఈఓకు సైతం అవగాహన లేదనే విషయం బట్టబయలైందన్నారు. 

బలపడుతున్న అనుమానాలు
ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు ఆలయ సిబ్బందిని సెలవుపై పంపడం, సీసీటీవీలను తాత్కాలికంగా నిలిపివేయడం అనేక అనుమానాలకు అవకాశం ఇస్తోంది. నిధుల కోసం శ్రీవారిపోటులో తవ్వకాలు జరిగాయని, శ్రీవారి ఆభరణాలు కనిపించడం లేదని, విదేశాలకు తరలివెళ్లినట్లుగా కొన్ని నెలల క్రితం తాను చేసిన ఆరోపణలకు బోర్డు చర్యలు బలం చేకూరుస్తున్నాయన్నారు. భక్తులకు దర్శన భాగ్యం లేకుండా పోతుంది, శ్రీవారి నగలు దొంగతనానికి గురవుతాయని పోతులూరి వీరబ్రహ్మం గతంలో చెప్పిన మాటలు అక్షరసత్యాలయ్యాయన్నారు.

శ్రీవారి సాక్షిగా జరుగుతున్న అన్యాయాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తున్నట్లు బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ప్రకటనతో టీటీడీ బోర్డు ఉలిక్కిపడిందన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. గతంలో చేసిన ఆరోపణలకు సైతం కట్టుబడి ఉన్నానన్నారు. తిరుమల విషయాలను పొరుగు రాష్ట్రంలోని చెన్నైకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించగా, చెన్నైలో మా పిల్లలు ఉన్నందున వస్తుంటా, మాట్లాడుతున్నా అని మీడియాతో అన్నారు.  

మరిన్ని వార్తలు