అందుకే రాలేకపోయా

28 Nov, 2018 12:30 IST|Sakshi

అంబి అభిమానులూ మన్నించాలి

ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ ఎంపీ రమ్య పోస్టింగ్స్‌

అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆవేదన

కర్ణాటక, శివాజీనగర : కన్నడ ప్రముఖ సినీ నటుడు అంబరీశ్‌ అంతిమ దర్శనానికి రాని మాజీ ఎంపీ రమ్యాపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఆమె గైర్హాజర్‌కు సంబంధించి అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే తన కాలుకు అరుదైన వ్యాధి సోకడంతోనే తాను అంబరీశ్‌ అంకుల్‌ అంత్యక్రియలకు రాలేదని, ఇందుకు ఎంతో బాధపడుతున్నానని ఆమె ఒక ఫోటో పోస్టు చేసి అందులో సందేశాన్ని పంపారు.

అరుదైన వ్యాధి : రమ్యా ఆస్టియోకాల్‌యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పోస్టు పెట్టింది. కాలులోని మూలగకు సంబంధించిన వ్యాధి ఇది. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో ఆమె అక్టోబర్‌ నుంచి విశ్రాంతిలో ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాలుకు శస్త్ర చికిత్స ఫొటోను కూడా పోస్టు చేసి ఒక సందేశం కూడా రాశారు.  

10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే : ఆస్టియోకాల్‌యటోమా అనేది అరుదైన వ్యాధికి మాజీ ఎంపీ రమ్య గురయ్యారు. పది లక్షల మందిలో ఒక్కరికి ఈ వ్యాధి వస్తుంది.   ఎముక ములగుల్లో బాధ విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాధితో నడిచేందుకు సాధ్యం కాదు. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఆపరేషన్‌ తప్పదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దివ్య స్పందన అనే అమ్మాయి శాండల్‌వుడ్‌లో రమ్యాగా ఎదగి అంబరీశ్‌ ఆశీర్వాదంతో ఎంపీ అయ్యారు. అటువంటి అంబరీశ్‌ అంతిమ దర్శనానికి రాకపోవడంతో అంబీ అభిమానుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది, సోషల్‌ మీడియాల్లో వస్తున్న పోస్టులను చూసిన రమ్య తన గైర్హాజరుకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. 

మరిన్ని వార్తలు