ఆ రెండు రకాల అత్యాచారాలూ ఒకలాంటివే

5 Mar, 2014 00:24 IST|Sakshi


న్యూఢిల్లీ: భర్త చేతిలో అత్యాచారానికి గురై భార్యను కూడా సాధారణ అత్యాచార బాధితురాలి మాదిరిగానే పరిగణించాలని స్థానిక కోర్టు  మంగళవారం స్పష్టం చేసింది. గర్భిణి  అయిన భార్యతో అసహజ రతి జరిపిన భర్తకు బెయిల్ తిరస్కరిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కామినీలావు పైవ్యాఖ్యలు చేశారు. వైవాహిక జీవితాల్లో అత్యాచారాలకు బలవుతున్న మహిళలు మౌనంగా రోదిస్తున్నా చట్టం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ అత్యాచార బాధితురాలి మాదిరిగానే భర్తల వల్ల ఇబ్బందిపడే మహిళలకూ ప్రభుత్వ సాయమందించాలని అభిప్రాయపడ్డారు. తాను గర్భవతిగా ఉన్నప్పటికీ భర్త మద్యం సేవించి వచ్చి అసహజరతి కోసం ఇబ్బంది పెడుతున్నాడంటూ కేశవపురం మహిళ ఒకరు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తొమ్మిదేళ్ల కొడుకుతోనూ శృంగారం గురించి మాట్లాడుతున్న నిందితుడి మానసికస్థితి సరిగ్గా లేనట్టు అర్థమవుతోందని కోర్టు పేర్కొంది.
 
  బాధితురాలికి భర్త అయినంత మాత్రాన అతనిపై జాలి చూపడం కుదరదని న్యాయమూర్తి కామిని స్పష్టం చేశారు. తాను భర్తపైనే ఆధారపడ్డందున అతణ్ని విడుదల చేయాలన్న బాధితురాలి విజ్ఞప్తిని తిరస్కరించారు. అత్తింటి వారి ఒత్తిడి మేరకే గర్భంతో ఉన్నా ఆమె స్వయంగా కోర్టుకు వచ్చి విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్త సరిగ్గా లేదంటూ అక్కడి డీసీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి చర్యల కోసం బాధితురాలి ఆర్థిక, మానసికస్థితిని అంచనా వేసి నివేదిక సమర్పించాలని స్థానిక జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. దీని ప్రతిని నగర కమిషనర్‌కూ పంపించాలన్నారు.

మరిన్ని వార్తలు