అరసవల్లిలో అర్ధరాత్రి నుంచే సూర్యజయంతి ఉత్సవం

2 Feb, 2017 11:01 IST|Sakshi
అరసవల్లి: రథసప్తమి (సూర్యజయంతి) ఉత్సవం గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానుంది. వెలుగుల రేడు అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా గురువారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి స్వామి వారికి క్షీరాభిషేక సేవ ప్రారంభమవుతుంది. ఇందుకోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో కంటే ఈసారి సాంకేతికతను అధికంగా వినియోగిస్తూ పూర్తిస్థాయి ఆధునీకరణతో బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు చేశారు.
 
శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూర్యదేవాలయ గర్భాలయంలోకి వెళ్లి తొలి దర్శనం, తొలి పూజలతో పాటు క్షీరాభిషేకం చేయనున్నారు. అంతకుముందు ఆదిత్యునికి 12.15 గంటలకే మేల్కొలుపు సేవ, సుప్రభాత సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాన అర్చకుడు శంకరశర్మ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంచామృతాలతో అభిషేకాలకు రంగం సిద్ధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ అభిషేకసేవ శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వామి నిజరూప దర్శనం కల్పిస్తారు.
 
డీసీఎంఎస్‌ కార్యాలయం నుంచి దర్శనానికి క్యూలైన్లు సిద్ధం చేశారు. 216, 100, 500 రూపాయల దర్శన టిక్కెట్లు క్యూలైన్లో ఇవ్వనున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనాల్లో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్రీ దర్శనం (సాధారణ దర్శనం) క్యూలైన్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మధ్యలో విశ్రాంతి కోసం కంపార్ట్‌మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు, ఉచిత ప్రసాదాల పంపిణీ, బస్సు సౌకర్యం, మంచినీరు, మజ్జిగ పంపిణీలను చేపట్టనున్నారు. భక్తులు చక్కగా దర్శనాలు చేసుకుని క్షేమంగా స్వప్రాంతాలకు తిరిగి వెళ్లాలని ఆలయ ఇవో శ్యామలాదేవి ఆకాంక్షించారు. 
మరిన్ని వార్తలు