రీ పోలింగ్‌పై జయ వ్యతిరేకత

7 May, 2014 23:17 IST|Sakshi

టీ.నగర్, న్యూస్‌లైన్: సేలం, నామక్కల్ పార్లమెంటు నియోజకవర్గాలలో తలా ఒక పోలింగ్ కేంద్రంలో గురువారం రీపోలింగ్ జరపడానికి ముఖ్యమంత్రి జయలలిత వ్యతిరేకత తెలిపారు. సేలం పార్లమెంటు పరిధిలో గల సేలం కార్పొరేషన్ మాధ్యమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో 579 మంది ఓట్లు వేశారు. ఇక్కడ ఉపయోగించిన ఈవీఎంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రంలో గురువారం రీపోలింగ్ జరిపేందుకు ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే నామక్కల్ నియోజకవర్గం పరిధిలో గల తిరుచెంగోడు కోట పాళయం పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలోనూ ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో గురువారం రీపోలింగ్ జరగనుంది.
 
 ఇందుకు డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే వ్యతిరేకత తెలిపాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత బుధవారం ప్రధాన ఎన్నికల అధికారికి ఒక లేఖ పంపారు. అందులో సేలం నియోజకవర్గంలో 213వ పోలింగ్ బూత్‌లో 77.61 శాతం ఓట్లు నమోదయ్యాయని అదే విధంగా నామక్కల్ నియోజకవ ర్గంలో 37వ పోలింగ్‌బూత్‌లో 80.26 శాతం ఓట్లు నమోదైనట్లు సమాచారం అందిందన్నారు. ఈ రెండు పోలింగ్ బూతుల్లో ఓట్ల నమోదు గురించి ఏ పార్టీ కూడా వ్యతిరేకత తెలపలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో 48 గంటల అవకాశం కూడా ఇవ్వకుండా గురువారం రీ పోలింగ్ జరిపేందుకు ఈసీ ఉత్తర్వులు ఇచ్చిందని ఇది పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీంతో రీ పోలింగ్ ఉపసంహరించుకోవాలని, రీపోలింగ్, పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు