40 ఏళ్లుగా వెతికా 63 వచ్చాయి ఇక మీరే వెతికి పెట్టాలి

3 Feb, 2020 14:11 IST|Sakshi

బెంగళూరు: మనమలు, మనవరాళ్ళకు పెళ్లి సంబంధాలను చూడాల్సిన వయసులో ఓ వృద్ధుడు తనకు తోడు కోసం అధికారులకు అభ్యర్థన పెట్టుకున్నాడు. ఒంటరి జీవితం దుర్భరంగా ఉంది. జీవిత భాగస్వామి లేక లైఫ్‌ బోరింగ్‌లా ఉంది. వధువు కోసం వెతుకులాటలోనే 40 ఏళ్లు గడిచిపోయాయి. 63 ఏళ్లు వచ్చాయి. ఇక మిగిలింది వృద్ధాప్యమే కాబట్టి కృష్ణా, రామా అంటూ గడిపెయ్యాలి. కానీ.. ఈ వయసులో  తోడు కావాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పంచాయతీ ఆఫీసుకు తనకు వధువు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ దరఖాస్తు చూసి ఆశ్చర్యపోవడం వారి వంతైయ్యింది.

వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని నరేగల్‌ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ధ్యామన్న కమ్మర్‌ అనే వ్యక్తి ఓ మందిరంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఆయనకు  చాలా కాలంగా పెళ్లి కావడం లేదు. 40 ఏళ్లుగా అమ్మాయి కోసం పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. దీంతో విసుగు చెందిన ఆ ముసలాయన పంచాయతీ అధికారులకు ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందులో నా బాగోగులు చూడడానికి ఎవరూ లేరు. అందువల్ల నా సొంత కులానికి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి సరైన అమ్మాయిని వెతికి పెట్టండి అంటూ దరఖాస్తు చేసుకున్నాడు. అధ్యక్షుడు, పంచాయతీ అభివృద్ధి అధికారి ధ్యామన్న దరఖాస్తును స్వీకరించి రసీదు ఇచ్చారు. కొంతమంది గ్రామ పంచాయతీ సభ్యులు కూడా ధ్యామన్న దరఖాస్తుపై సంతకం చేసి మద్దతు ఇవ్వడం గమనార్హం. 

మరిన్ని వార్తలు