సన్యాసం స్వీకరించిన రంజిత

28 Dec, 2013 03:22 IST|Sakshi
సన్యాసం స్వీకరించిన రంజిత

బెంగళూరు, న్యూస్‌లైన్ : నిత్యానంద శిష్యురాలు, బహుభాషా నటి రంజిత శుక్రవారం సన్యాసం స్వీకరించారు. బెంగళూరు శివారులోని బిడిది సమీపంలోని ధ్యానపీఠంలో నిత్యానంద సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రంజితతో పాటు 40 మంది సన్యాసం తీసుకున్నారు. అనంతరం రంజిత పేరును ‘మా ఆనందమయి’గా మార్చారు. ప్రతి ఏటా జనవరి 1న నిత్యానంద పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే జన్మనక్షత్రం ప్రకారం శుక్రవారం ఆయన ఈ వేడుకను తన శిష్యుల మధ్య పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేది వరకు ధ్యానపీఠంలో పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, నిత్యానంద జన్మదిన వేడుకలకు మీడియాను దూరం పెట్టారు.
 
కేసులుండగా సన్యాసమా?

నటి రంజిత సన్యాసం తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని శ్రీజగద్గురు బసవ ధర్మ పీఠాధ్యక్షురాలు మాత మహాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నిత్యానంద - రంజితల కేసు విచారణ దశలోనే ఉందని, ఈ సమయంలో ఆమె సన్యాసం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సన్యాసం తీసుకోవడమంటే అంత సులువు కాదని, సేవ చేయడానికి సిద్ధం కావాలని, అన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని భోగాలు అనుభవిస్తూ సన్యాసి అని చెప్పుకోవడం సాధ్యం కాదని గుర్తు చేశారు. అసలు నిత్యానంద ఆశ్రమంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని అన్నారు.
 
నిరసనలు

 
నిత్యానందను రాష్ట్రం నుంచి వెలివేయాలంటూ కర్ణాటక నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో బిడిది ఆశ్రమం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. నిత్యానంద పోస్టర్లను చించి, నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ప్రహరీ ఎక్కి చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో నిత్యానంద శిష్యులు లోపలి నుంచి రాళ్లు రువ్వారు.  
 

మరిన్ని వార్తలు