ప్రసవం కోసం 10 కి.మీ నడక

4 Dec, 2019 07:30 IST|Sakshi
కుమారిని డోలిలో మట్టి రోడ్డుపై నడుచుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్తున్న బంధువులు ,ప్రసవించిన మగ బిడ్డతో కుమారి

డోలిలో గర్భిణిని ఆస్పత్రికి తరలింపు

లారీలో ప్రసవం  తల్లీబిడ్డ సురక్షితం

తమిళనాడు, సేలం: పురిటి నొప్పులతో అల్లాడుతున్న మహిళను గ్రామస్తులు డోలిలో ఆరు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు.  తర్వాత లారీలో ఆస్పత్రికి తరలిస్తుండగా అందులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మంగళవారం ఉదయం అందియూర్‌ కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ రోడ్‌ జిల్లా అందియూర్‌లో బర్గూర్‌ వద్ద కొండ ప్రాంతం ఉంది. ఈ కొండపై సుండాపూర్‌ గ్రామ ఉంది. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బస్సు కూడా లేదు. ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే 10 కిలోమీటర్ల దూరం కాలినడకన తామరైకరై వరకు నడిచి వచ్చి, తర్వాత అక్కడి నుంచి వాహనాల ద్వారా వెళ్లాల్సి ఉంది.

ఈ స్థితిలో సుండాపూర్‌ గ్రామానికి చెందిన మాదేశ్, అతని భార్య కుమారి (23) ఇద్దరు కూలీ కార్మికులు. వీరికి ఇది వరకే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. మళ్లీ గర్భవతి అయిన కుమారికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు ఏర్పడ్డాయి. బస్సు సౌకర్యం లేకపోవడంతో నొప్పులతో అల్లాడుతున్న ఆమెను డోలి కట్టి అందులో ఆస్పత్రికి తరలించడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు మూడు రోజులుగా భారీ వర్షాలతో మట్టి రోడ్డు అతలాకుతలంగా ఉంది. అయినా అధిక శ్రమకోర్చి తీసుకువచ్చారు. ఆరు కిలో మీటర్లు దూరం నడచి రాగా, అప్పుడు అక్కడికి వచ్చిన ఒక మినీ లారీలో కుమారిని ఎక్కించారు. నొప్పులు ఎక్కువ కావడంతో మాదేశ్‌తల్లి కన్నియమ్మాల్‌ తన కోడలు కుమారికి ప్రసవం చేసింది. కుమారికి పండంటి మగ బిడ్డ జన్మించాడు. తర్వాత అదే లారీలోనే తామరైకరై ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇకనైనా అధికారులు తాము మనుషులమేనని, తమ అవసరాలను గుర్తించి గ్రామానికి రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు