లాతూర్ చేరుకున్న వాటర్ ట్రైన్

12 Apr, 2016 08:22 IST|Sakshi
లాతూర్ చేరుకున్న వాటర్ ట్రైన్

ముంబై:  మరఠ్వాడ ప్రజలకు  50 లక్షల లీటర్ల నీటితో బయల్దేరిన వాటర్ ట్రయిన్ మంగళవారం ఉదయం లాతూర్ చేరుకుంది. తీవ్ర కరువు, నీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న మరఠ్వాడలోని లాతూర్కు నీరు అందించేందుకు ఈ రైలు పశ్చిమ మహారాష్ట్రలోని మిరాజ్ రైల్వేస్టేషన్ నుంచి నిన్న బయల్దేరింది. పది వ్యాగన్లతో చేరుకున్న ఈ రైలును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు లాతూర్కు తరలివచ్చారు.  రైలులో చేరుకున్న నీటిని పైప్ లైన్ల ద్వారా తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలోనే నీటిని లాతూర్‌కు పంపిణీ చేయనున్నారు.

కాగా భయంకర నీటి ఎద్దడిని పారదోలేందుకు మహారాష్ట్ర సర్కార్ నడుం బిగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని కోట ప్రాంతం నుంచి కేంద్ర రైల్వేశాఖ సహాయంతో రైళ్లలో నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అక్కడ నుంచి 50 వ్యాగన్ల రైలు ఆదివారం మిరాజ్ కు చేరుకుంది. మరో 50 వ్యాగన్లతో కూడిన రెండో రైలు ఈ నెల 15న మిరాజ్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర మరాఠ్వాడాలోని అన్ని జిల్లాలతోపాటు విదర్భలోని కొన్ని జిల్లాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కుంటున్నాయి. ఆ ప్రాంతంలోని 11 భారీ జలాశయాలన్నీ ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. ఇటు ముంబైలోనూ నీటి ఎద్దడి కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు