జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాలి

18 Nov, 2013 02:21 IST|Sakshi

రాయచూరు, న్యూస్‌లైన్ : దేశంలో 50 శాతానికి పైగా ఓబీసీ వర్గాల వారు ఉన్నారని,జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతం పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమ మండలి అధ్యక్షుడు ఎన్.శంకరప్ప అభిప్రాయపడ్డారు. స్థానిక ఏపీఎంసీ హాల్‌లో ఎల్‌ఐసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాయచూరు విభాగం ఏర్పాటు చేసిన రెండవ సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

వీపీ.సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీ వర్గాలకు నిర్ణయించారని. అయితే ప్రస్తుతం ఓబీసీ జనాభా పెరిగిందని,అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని కోరారు. రిజర్వేషన్లతో పాటు ఇతర సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజంలోని అందరికి సౌకర్యాలు లభించాలంటే అక్షరాస్యులు కావాలన్నారు. సంఘం జాతీయ అధ్యక్షురాలు కే.కమలాకన్నన్ మాట్లాడుతూ ఓబీసీ వర్గాల హక్కుల సాధన కోసం 1990లోనే సంఘం స్థాపితమైందన్నారు.

పోరాటం చేస్తున్నా హక్కులు మాత్రం దక్కడం లేదన్నారు. ఓబీసీ వర్గాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి కేటాయించిన పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ అధికారి నరసయ్య మాట్లాడుతూ  పెద్దల మార్గదర్శకంలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు యువకులు కృషిచేయాలన్నారు. సంఘం అధ్యక్షుడు గట్టు రమేష్, కార్యదర్శి జయకుమార్, మార్కెటింగ్ మేనేజర్ అనంతపద్మనాభ, కే.శాంతప్ప, ఈరన్న, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు