ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై న్యాయ సమీక్ష చేయవచ్చు

16 Feb, 2016 03:42 IST|Sakshi

సస్పెన్షన్‌కు కారణమైన ఆధారాలను సభ్యునికి ఇవ్వాల్సిందే
అలా ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
దీనికి విరుద్ధంగా సస్పెన్షన్ ఉంటే దాన్ని రద్దు చేయవచ్చు
తమిళనాడు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
రోజా సస్పెన్షన్ నేపథ్యంలో ఈ తీర్పునకు ప్రాముఖ్యత


సాక్షి, హైదరాబాద్: సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా శాసనసభ వర్గాలు ఓ శాసనసభ్యుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ కారణంతో శాసనసభ్యుడిని సస్పెండ్ చేశారో ఆ కారణానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు ఉంటే, వాటిని ఆ శాసనసభ్యునికి అందచేయకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. శాసనసభ్యుని సస్పెన్షన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంటే ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయవచ్చునంది. సభాహక్కులకు భంగం కలిగించేటట్లు వ్యవహరించారంటూ సినీనటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకె పార్టీకి చెందిన ఆరుగురు శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వారిని తరువాతి అసెంబ్లీ సెషన్‌లో పది రోజులపాటు సస్పెండ్ చేయాలని, అలాగే వారి జీతభత్యాలను కూడా నిలిపేయాలని సభా హక్కుల కమిటీ సిఫారసు చేసింది. వీటన్నింటినీ సవాలు చేస్తూ సస్పెండ్ అయిన శాసనసభ్యులు అలగాపురం ఆర్.మోహన్‌రాజ్, మరికొందరు రాజ్యాంగంలోని అధికరణ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం దీనిపై కీలక తీర్పు వెలువరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజాపై సస్పెన్షన్ వేటు వేసిన తరువాత కూడా ఆమెకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా, వీడియో కాపీలను అందచేయకుండా అసెంబ్లీ వర్గాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పునకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.

 సహజ న్యాయం కాదు

 పార్లమెంట్, శాసనసభలో సభ్యులకు వాక్ స్వాతంత్య్రమన్నది రాజ్యాంగపరమైన హక్కని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ‘ప్రస్తుత కేసులో పిటిషనర్లను సస్పెండ్ చేయడం ద్వారా అధికరణ 194 ప్రకారం వారికి సంక్రమించిన వాక్ స్వాతంత్యపు హక్కును అడ్డుకున్నట్లయింది. మొదట 19 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన హక్కుల కమిటీ ఆ తరువాత ఆరుగురు పిటిషనర్లనే ఎందుకు సస్పెండ్ చేసిందో అర్థం కావడం లేదు. వీడియో ఆధారంగానే పిటిషనర్లపై సభా హక్కుల కింద చర్యలు తీసుకున్నట్లు శాసనసభ వర్గాలు చెబుతున్నారు. వీడియో చూసిన తరువాతనే పిటిషనర్లపై చర్యలు తీసుకున్నట్లు హక్కుల కమిటీ మినిట్స్ ద్వారా కూడా తెలుస్తోంది. వీడియో ఆధారంగా తమపై చర్యలు తీసుకునే ముందు తమ వాదనలు వినాలని, ఆ వీడియో ప్రామాణికతను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈ కేసులో పిటిషనర్లకు వీడియో చూపడమన్నది సహజ న్యాయ సూత్రం. వీడియో కాపీ ఇవ్వడం ద్వారా సభా హక్కుల కమిటీ వారికి తమ వాదన వినిపించే అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఇది సభా హక్కుల కమిటీ చట్టపరమైన బాధ్యత. వీడియో ఇవ్వకపోవడమన్నది స్పష్టంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ తమిళనాడు అసెంబ్లీ జారీ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తున్నాం. సస్పెన్షన్ తీర్మానమే రద్దయింది కాబట్టి, వారి జీతభత్యాలను గతంలో వలే యథాతథంగా పునరుద్దరించాలి’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు