మిల్లర్ల మాయాజాలం

20 Sep, 2016 12:08 IST|Sakshi
 మిల్లర్ల గుప్పిట్లోనే రూ.50 కోట్ల సర్కారు ధాన్యం
 కస్టం మిల్లింగ్ బియ్యం బకాయిలు 23 వేల మెట్రిక్ టన్నులు
 సెప్టెంబర్ నెలాఖరు వరకే గడువు
 మారని మిల్లర్ల వ్యవహార శైలి
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రైసు మిల్లర్ల తీరు ఏ మాత్రం మారడం లేదు. కస్టం మిల్లింగ్ కోసం పౌర సరఫరాల సంస్థ నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ మిల్లర్లు సర్కారుకు ఇవ్వాల్సిన బియ్యం బకాయిల విలువ ఏకంగా రూ.50 కోట్లు ఉంటుందంటే సర్కారు సొమ్ముతో మిల్లర్లు ఏ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో గతేడాది రబీలో ప్రభుత్వం ఐకేపీ, సహకార సంఘాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించింది. ఈ ఒక్క రబీ సీజన్‌లోనే 96,407 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు జిల్లాలోని సుమారు 35 మంది రైసు మిల్లర్లకు అప్పగించింది.
 
మిల్లర్లు వెంటనే బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉండగా, నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. మిల్లర్లు ఒక క్వింటాల్ ధాన్యం తీసుకుంటే 68 కిలోలు బాయిల్డ్ రైస్, 67 కిలోలు రా రైస్ చొప్పున సర్కారుకు అప్పగించాలి. ఇలా సర్కారు నుంచి తీసుకున్న 96,407 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను మిల్లర్లు 65,113 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించాలి. కానీ.. ఇప్పటివరకు కేవలం 41,443 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. ఇంకా 23,737 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు బకాయిలున్నారు. అంటే ఇచ్చిన బియ్యంలో 58 శాతం మాత్రమే అప్పగించారు.
 
దగ్గర పడుతున్న గడువు..
రబీలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సెప్టెంబర్ నెలాఖరు వరకు కస్టం మిల్లింగ్ బియ్యం అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గడువు దగ్గర పడుతున్నా మిల్లర్లలో చలనం లేకుండాపోయింది. పూర్తిస్థాయిలో కస్టం మిల్లింగ్ బియ్యం సరఫరా చేసేందుకు మరో పక్షం రోజులు మాత్రమే గడువున్నా.. ఇంకా 40 శాతం అంటే 23 వేల మెట్రిక్ టన్నులు మిల్లర్ల వద్దే ఉంచుకున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా కస్టం మిల్లింగ్ బియ్యం మిల్లర్ల వద్దే ఉండే అవకాశాలున్నాయి. ఈ బియ్యాన్ని వెంటనే పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మిల్లర్లతో సమీక్షలు నిర్వహించినప్పటికీ బియ్యం బకాయిల గుట్ట తరగడం లేదు. గతేడాది కూడా కస్టం మిల్లింగ్ బియ్యాన్ని ఇచ్చేందుకు మిల్లర్లు తీవ్ర జాప్యం చేశారు. సర్కారు ధాన్యానికి సంబంధించిన డబ్బులతో కొందరు మిల్లర్లు సొంత వ్యాపారాలు చేసుకున్నారనే విమర్శలున్నాయి. ఈసారి కూడా పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. మిల్లర్ల తీరుపై కఠినంగా వ్యవహరిస్తే రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
 
ఆ మిల్లర్లకు సీఎంఆర్ నో..
జిల్లాలో రూపాయికి కిలో బియ్యాన్ని పక్కదారి పట్టించిన ముగ్గురు రైసు మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు కొరఢా ఝులిపించారు. 6ఏ కేసులతోపాటు, క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ముగ్గురు మిల్లర్లకు కూడా ఈసారి మళ్లీ కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని కేటాయించాలని జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తేవడం గమనార్హం. 
>
మరిన్ని వార్తలు