ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు

25 Nov, 2013 00:29 IST|Sakshi

దాదర్, న్యూస్‌లైన్:  ఆంధ్ర కళా సమితి ఆధ్వర్యంలో తూర్పు డోంబివలి పట్టణంలో ఆదివారం ‘శ్రీ వేంకటేశ్వర కల్యాణోత్సవాలు’ ఘనంగా జరిగాయి. సర్వేష్ సభా గృహ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి సమితి సభ్యులే కాక డోంబివలి శివారు ప్రాంతాలకు చెందిన భక్తులంతా తరలిరావడం ఒక విశేషం. ఉదయం 8 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతోఉత్సావాలు ప్రారంభించారు. వేదికపై వెలసిన స్వామి వారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రములు, బంగారు నగలు అలంకరించి విశ్వక్సేన ఆరాధనతో కల్యాణానికి నాంది పలికారు.

వివాహంలోని ముఖ్య ఘట్టాలైన పుణ్యవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, పాద ప్రక్షాళనము, మధుపర్కం, కన్యాదానం, జీలకర్ర-బెల్లం, ముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర తంతులు కన్నులారా చూసిన భక్తు లు తన్మయంలో మునిగిపోయారు. ప్రాంగణమం తా ‘గోవింద’ నామస్మరణతో మార్మోగింది. కల్యాణ అనంతరం స్వామివారి పేరిట సామూహిక తులసి అర్చనలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన అర్చకులు శ్రీకాంతాచార్యులు, నరసింహా చార్యులు, గోపాలాచార్యు లు, శ్రీనివాసాచార్యులు, స్థానిక అర్చకులు మద్దూరు మల్లికార్జున శర్మ కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
 ఘనంగా ‘రథ యాత్ర’
 శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం పురస్కరించుకొని శనివారం సాయంత్రం పశ్చిమ డోంబి వలి ఆనంద్‌నగర్‌లో ఆదిత్య కుటీర్ నుంచి కల్యాణ మండపం వరకు పురవీధులలో జరిగిన రథ యాత్ర లో తెలుగు ప్రజలతోబాటు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మండపం చెంతకు రథ యాత్ర చేరగానే స్వామి వారికి, అమ్మవార్లకు ఘనంగా స్వాగతం పలికి ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా మొగల్తూరు పట్టణం అనిరుద్ధ భజన మండలికి చెందిన అనంతరపల్లి నాగమణి ఆధ్వర్యంలో పాతికమంది మహిళా సభ్యులు ప్రదర్శించిన కోలాటం, భజన గీతాలు కల్యాణోత్సవాలకు శోభనిచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆంధ్ర కళా సమితి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డోంబివలి ఆంధ్రా బ్యాంక్ శాఖ సిబ్బంది ఇక్కడ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసి తమ సేవలను వివరించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా