మరణ మృదంగం

20 Feb, 2016 01:44 IST|Sakshi

రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు
 
నాలుగు వేర్వేరు రోడ్డు  ప్రమాదాల్లో 20 మంది వృత్యువాత
ఒకే ఘటనలో 12 మందిని కబలించిన మృత్యువు
మరోఘటనలో ఓ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలు తీసిన లారీ
మరో ముగ్గురికి మృత్యువై ఎదురొచ్చిన‘టాటా సఫారీ’
డివైడర్‌ను ఢీ కొని మరో ఇద్దరు టీనేజర్లు...
అన్ని ఘటనల్లోనూ అతి వేగమే ప్రమాదానికి కారణం

 
బెంగళూరు:  రాష్ట్రంలో రహదారులు రక్తమోడాయి. శుక్రవారం ఒక్కరోజే  నాలుగు  వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆప్తులను కోల్పోయిన సంబంధికుల ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాల్లో  విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు....
 
ధార్మిక కార్యక్రమం నుంచి తిరిగి వస్తూ...
బెంగళూరు నుంచి హొసపేటకు ఉక్కు కడ్డీల లోడుతో వెళుతున్న లారీ (యూపీ-81,ఏఎఫ్-5415) చిత్రదుర్గ శివారు ప్రాంతాలకు శుక్రవారం తెల్లవారుజాము 3 గంటలకు చేరుకుంది. ఆసమయంలో వేగంగా వెలుతున్న లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టాట్‌ఏస్‌ను ఢీ కొని దాని పై ఒరిగిపోయింది. దీంతో టాటాఏస్ డ్రైవర్ కుమార్ (35)తో సహా వాహనంలోని 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కొల్లప్ప(68), మంజణ్ణ(61), గంగమ్మ(60), దుర్గప్ప(51), తిప్పేస్వామి(45), నాగణ్ణ(45), గంగణ్ణ(43), గంగాధర్(42), మంజునాథ్(40), టాటా ఏస్ డ్రైవర్ కుమార్(35), సుదీప్(17), చేతన్(10)లు ఉన్నారు. వీరంతా కూడగహళ్లి గ్రామానికి చెందిన వారు. గురువారం రాత్రి టాటా ఏస్ వాహనంలో  సంఘటన జరిగిన చోటుకు దగ్గరగా ఉన్న చిక్కగూండనహళ్లిలో ఉన్న పాం డురంగ దేవస్థానానికి గురువారం రాత్రి వెళ్లారు. అక్కడ భజన ముగిసిన వెంటనే సొంతఊరైన కూడగహళ్లికి వెళ్లే సమయంలో మృత్యురూపంలో వచ్చిన లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే స్థానిక తురువనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్‌మార్టం తర్వాత సంబంధీకులకు అందజేశారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు....
రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన  జయకీర్తి ఇంద్ర, (55), వాజ్యశీల అలియాస్ వాగేశ్వరి (50) దంపతులు కుమారుడు ప్రశాంత్ (31)తో కలిసి బెంగళూరు నుంచి మూడబిదరి పట్టణానికి  ఆల్టోకారులో  వెళుతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని చెన్నపట్టణ శివారుల్లో బండిహళ్లి వద్ద ఢీ కొట్టింది. ఆ వేగానికి కారు నుజ్జునుజ్జు కాగా, వాహనంలోని ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషయం తెలిసిన వెంటనే చెన్నపట్టణ గ్రామీణ పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తును ప్రారంభించారు.
 
బైక్‌ను టాటా సఫారీ ఢీ కొన్న ఘటనలో

గదగ్ జిల్లా శిరహట్టిలో ఉంటున్న అజీత్ (35) తన బంధువులైన మల్లేశప్ప (55), ఫక్కీరప్ప (45)తో కలసి బైక్‌పై  సొంత గ్రామమైన హళ్యాలకు వెళ్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం శిరహట్టి తాలూకా చిక్కసవణూరుకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న టాటా సఫారీ  ఢొకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురూ కిందికి పడ్డారు. ఘటనలో వీరి తలలకు బలమైన గాయాలయ్యాయి.   స్థానికులు స్పందించి క్షతగాత్రులను దగ్గరల్లోని ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే వీరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న శిరహట్టి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
రోడ్డు డివైడర్‌ను ఢీ కొని...
 చిక్కబళాపుర జిల్లా బాగేపల్లి పట్టణానికి చెందిన ముఫ్తియార్ బేగ్ (18), అతీఫ్ (20) బైక్‌పై వెళ్తుండగా పట్టణంలోని న్యాయస్థానం వద్దకుఅదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొన్నారు.  ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.  
 
 

మరిన్ని వార్తలు