బీఎస్పీతో పొత్తుకు రెడీ

8 Oct, 2013 00:19 IST|Sakshi

సాక్షి, ముంబై: శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమితో జతకట్టినప్పటికీ ఆశించివేమీ దొరక్కపోవడంతో అసంతృప్తికి గురైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ప్రత్యామ్నాయాల మార్గాల వేటలోపడ్డారు. శివసేన, బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండానే బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)తో పొత్తులు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై బీఎస్పీ అధినేత్రి మాయవతితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఠవలే స్పష్టం చేశారు. అఠవలే ప్రతిపాదన పై మాయవతే తుదినిర్ణయం తీసుకుంటారని బీఎస్పీ ప్రదేశ్ అధ్యక్షుడు విలాస్ గరుడ్ అన్నారు. శివసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత మొదటిసారిగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అఠవలే డిమాండ్ చేసిన స్థానాలను ఆర్పీఐకి కేటాయించేందుకు సేన, బీజేపీలో ఏ ఒక్కటీ సిద్ధంగా లేదు. క నీసం తనను రాజ్యసభకు పంపించాలన్న ఆఠవలే అభ్యర్థననూ పట్టించుకోలేదు.  దీంతో కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న అఠవలే కాషాయకూటమితో తెగతెంపులు చేసుకుంటామని ఇది వరకే హెచ్చరించారు.   ఈనెల మూడో తేదీన ఔరంగాబాద్‌లో జరిగిన ఆర్పీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ బీఎస్పీతో జతకట్టనున్నట్లు సూచనాప్రాయంగా వెల్లడించారు.
 
 దళిత-బహుజన సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే జాతీయస్థాయిలో బీఎస్పీ, ఆర్పీఐ ఒక తాటిపైకి రావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీఎస్పీ జాతీయ పార్టీ. వివిధ రాష్ట్రాల్లో దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్పీఐకి సైతం అనేక రాష్ట్రాలలో యూనియన్లు ఉన్నాయి.


 దీంతో ఈ రెండు పార్టీలు ఒకేతాటిపైకి వస్తే దళితవర్గం రాజకీయంగా, సామాజికంగా మరింత బలపడుతుందని ఆఠవలే అభిప్రాయపడ్డారు. 1996లో పుణేలో జరిగిన ఆర్పీఐ సమావేశంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకుందామని   ప్రతిపాదిం చారు. అనివార్య కారణాలవల్ల అప్పుడు పొత్తు కుదుర్చుకోలేకపోయామని ఆఠవలే అన్నారు. ఆ కల నెరవేరడానికి ఇప్పుడు సమయం దగ్గరపడిందని  వ్యాఖ్యానించారు. ఈ అంశంపై త్వరలో బీఎస్పీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ఎంపీ వీరసింహ్‌తో చర్చిస్తానని ప్రకటించారు. తదనంతరం మాయవతితో కూడా చర్చలు జరుపుతానని అఠవలే పేర్కొన్నారు. ఆర్పీఐ ప్రతిపాదనపై మాయవతి ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.

మరిన్ని వార్తలు