న్యూ ఇయర్‌కు మెట్రో వాత

29 Dec, 2017 07:57 IST|Sakshi

31న రాత్రి చార్జీల తాత్కాలిక పెంపు

ఎంజీ రోడ్‌ స్టేషన్‌కు రావాలంటే రూ.50 టికెట్‌

జనం ఉత్సాహంతో జేబు నింపుకోవడానికి మెట్రో రైల్‌ సంస్థ పథకం వేసింది. 31న రాత్రి వేడుకల కోసం ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్‌కు భారీగా తరలివచ్చే ఔత్సాహికులు మెట్రో రైలు ఎక్కాలంటే రెట్టింపు చార్జీలు చెల్లించాలి. ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి వేకువజాము 2 వరకు ఇదే తంతు.

సాక్షి, బెంగళూరు: న్యూ ఇయర్‌ వేడుకలను సొమ్ము చేసుకోవడానికి బెంగళూరు నమ్మ మెట్రో రైల్‌ సంస్థ చార్జీలను తాత్కాలికంగా పెంచింది. చిల్లర సమస్య వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఎంజీ రోడ్, బ్రిగేడ్‌ రోడ్డులో న్యూ ఇయర్‌ వేడుకలు భారీగా జరుగుతాయి. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎం.జీ రోడ్డుకు మెట్రో కనెక్టివిటీ ఉంది. దీంతో క్యాబ్‌లు, సొంత వాహనాలు వదిలి ప్రజలు మెట్రోలోనే వేడుకలకు వచ్చే అవకాశముంది. డిసెంబర్‌ 31 రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య ట్రినిటీ సర్కిల్, ఎం.జీరోడ్, కబ్బన్‌ పార్క్‌ నుంచి నగరంలోని ఏ ప్రాంతంలోని మెట్రో స్టేషన్‌కు వెళ్లే వారు రూ.50 చెల్లించి టికెట్‌ను కొనాల్సిందే. ఇతర ప్రాంతాల నుంచి ఈ మూడు మెట్రో స్టేషన్లకు వచ్చేవారు కూడా ఇంతే మొత్తం ఇచ్చుకోవాలి. స్మార్ట్‌ కార్డ్‌ కలిగిన వారు మాత్రం పాత ధరల్లోనే ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఎప్పటిలాగా 15 శాతం రాయితీ కూడా లభించనుందని మెట్రో అధికారులు చెబుతున్నారు.

ఇందిరానగర్‌లోనూ వేడుకల జోరు
సాధారణంగా న్యూ ఇయర్‌ వేడుకలు నగరంలోని బ్రిగెడ్, ఎంజీ రోడ్లలో నిర్వహించుకోవడానికి యువత ఎక్కువ ఆసక్తి చూపించేంది. ఈసారి ఇందిరానగర్‌ 100 ఫీట్‌ రోడ్డు, కోరమంగళ, జాలహళ్లి ప్రాంతంలో కూడా న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహించుకోవడానికి యువత తహతహలాడుతోంది. ఆయా ప్రాంతాల్లో కొత్తగా బార్‌లు, పబ్‌లు రావడం ఒక కారణమైతే ఎంజీరోడ్, బ్రిగెడ్‌ రోడ్డుల్లో గత ఏడాది జరిగిన సంఘటనలూ మరో కారణం. అందులోనూ ఇందిరానగర్‌ రెస్టారెంట్‌ హబ్‌గా మారడం, మెట్రో కనెక్టివిటీ ఉండటం వల్ల యువత మిగిలిన రెండు ప్రాంతాలతో పోలిస్తే ఇందిరానగర్‌కు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇందిరానగర్‌తో పాటు కోరమంగళ, జాళహళ్లి  ప్రాంతాల్లో కూడా అదనపు సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు సిబ్బంది మోహరింపు తదితర చర్యలను నగర పోలీసులు చేపడుతున్నారు. ఇక న్యూ ఇయర్‌ వేడుకల్లో గస్తీ బృందంలో 500 హొయ్సల, 150 చీతా వాహనాలు గస్తీ కాస్తాయి. వాహనాల పార్కింగ్‌ను ఎంజీరోడ్, బ్రిగెడ్‌రోడ్, చర్చ్‌ స్ట్రీట్‌లలో నిషేదించనున్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఇలా
డ్రంక్‌ అండ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను ఈనెల 31 అంటే ఆదివారం రాత్రి 9 గంటలకు మొదలయ్యి సోమవారం 4 గంటల వరకూ కొనసాగనుంది. రవాణా శాఖ కూడా ఆదాయం పెంచుకోవడానికి రెడీ అవుతోంది. క్యాబ్‌లు, ఆటో వాలల పై నిఘా పెట్టి వినియోగదారుల నుంచి ఎక్కువ వసూలు చేయకుడా చర్యలు చేపడుతామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా బీఎంటీసీ సేవలను సైతం విస్తరించారు. బెంగళూరు నగరంలో ఆదివారం అర్ధరాత్రి 2 గంటల వరకు బీఎంటీసీ బస్సులు నగర వాసులకు అందుబాటులో ఉండనున్నాయి.

మరిన్ని వార్తలు